Tokyo Paralympics 2020: వరుసగా రెండోసారి దేశానికి పతాకం తీసుకొచ్చిన తంగవేలు

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.

Tangavelu

Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు హైజంప్‌లో దేశానికి రజత పతకం సాధించి పెట్టాడు. మంగళవారం(31 ఆగస్ట్ 2021) అద్భుత ప్రదర్శన చేసి పారా అథ్లెట్, పురుషుల హైజంప్ T63లో రజత పతకాన్ని సాధించాడు. అదే ఈవెంట్‌లో, శరద్ కుమార్ మూడో స్థానం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇద్దరు భారతీయులు పోడియంపై చోటు దక్కించుకుని దేశానికి పురస్కారాలను తెచ్చారు.

టోక్యో పారాలింపిక్స్‌లో, భారత్ అత్యుత్తమ క్రీడను ప్రదర్శించి, పతకాల సంఖ్యలో రెండంకెల సంఖ్యకు చేరుకుంది. మరియప్పన్ తంగవేలు విజయంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య పదికి చేరుకుంది. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్‌ నాలుగు పతకాలే సాధించగా.. అప్పుడు మరియప్పన్‌ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం సాధించి తొలిసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. వీరిద్దరిని మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలుపుతున్నారు.

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 2 స్వర్ణాలు, 5 రజతాలు మరియు 3 కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో జైపూర్‌కు చెందిన 19 ఏళ్ల అవ్ని లేఖారా బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన ఐదవ ప్రయత్నంలో, హర్యానాలోని సోనేపట్‌కు చెందిన 23 ఏళ్ల సుమిత్ ఆంటిల్ 68.55 మీటర్ల దూరం నుండి జావెలిన్ విసిరాడు, ఇది ఒక కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో అతను బంగారు పతకాన్ని సాధించాడు.

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన తంగవేలు, ఐదేళ్ల వయసులో బస్సు యాక్సిడెంట్‌లో మోకాలికింద కుడి కాలు బాగా దెబ్బతింది. శాశ్వత వైకల్యానికి గురైన తంగవేలు.. కుటుంబాన్ని పోషించేందుకు వార్తాపత్రిక హాకర్‌గా పని చేయాల్సి వచ్చింది. 25 ఏళ్ల తంగవేలుకు గత ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న కూడా లభించింది.