Marnus Labuschagne: టెస్టు క్రికెట్లో దూసుకుపోతున్న మార్నస్.. 5 ఏళ్లలో అతడిని మించిన బ్యాటర్ లేడు..

మార్నస్ టెస్టుల్లో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు (5 ఏళ్ల వ్యవధిలో) అతడి కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర ఆటగాడు ఎవరూ లేరు.

Marnus Labuschagne

Marnus Labuschagne – Birthday: ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఇవాళ 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆస్ట్రేలియా టెస్టుల్లో సాధిస్తోన్న విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ క్రికెటర్ గురించి తెలుసుకుందాం. అతడు 1994, జూన్ 22న జన్మించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 2018లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో మార్నస్ అడుగుపెట్టాడు. ఇప్పటివరకు మొత్తం 39 టెస్టులు ఆడిన మార్నస్ 3,474 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడి టాప్ స్కోరు 215. మార్నర్ మొత్తం 10 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు బాదాడు.

మార్నస్ టెస్టుల్లో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు (5 ఏళ్ల వ్యవధిలో) అతడి కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర ఆటగాడు ఎవరూ లేరు. దీన్ని బట్టి మార్నస్ ఎంత సమర్థంగా ఆడుతున్నాడో చెప్పొచ్చు. ఈ 5 ఏళ్ల వ్యవధిలో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ మొత్తం 2,770 పరుగులు చేశాడు. మొత్తం 34 మ్యాచులు ఆడాడు. ఎనిమిది సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు బాదాడు.

ఆ తర్వాతి స్థానంలో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అతడు 38 మ్యాచుల్లో 2,608 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మార్నస్ లబుషేన్ సొంత దేశం ఆస్ట్రేలియాలో మ్యాచులు జరిగితే మరింత చెలరేగి ఆడుతాడు. ఆస్ట్రేలియాలో మొత్తం 22 టెస్టు మ్యాచులు ఆడి 70.50 యావరేజ్ తో 2,397 పరుగులు చేశాడు.

అందులో తొమ్మిది సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సొంత దేశంలోనే అతడి టాప్ స్కోర్ 215గా ఉంది. విదేశాల్లో మాత్రం మార్నస్ సత్తా చాటలేకపోతున్నాడు. విదేశాల్లో అతడు మొత్తం 17 టెస్టు మ్యాచులు ఆడి 31 ఇన్నింగ్స్ లో కేవలం 1,067 పరుగులు మాత్రమే బాదాడు.

అందులో ఒకే సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-23 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో 20 టెస్టులు 35 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 1,576 పరుగులు బాదాడు. ఆ ఛాంపియన్‌షిప్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు.

Cricket World Cup 2023: వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియానికి మెరుగులు.. ఎందుకంటే?