Match Fixing in IPL 2025
Match Fixing in IPL 2025 : ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఐపీఎల్ 18వ సీజన్ ఫిక్సింగ్ చేసేందుకు భారీగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) ఐపీఎల్ 10 జట్లను అప్రమత్తం చేసింది. ఎవరైనా ఆటగాళ్లను సంప్రదిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా హెచ్చరించింది.
బీసీసీఐ ప్రకారం.. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు కోచ్‌లు, ఆటగాళ్లు, జట్టు యజమానులు, సహాయక సిబ్బంది, కామెంటర్ల ఫ్యామిలీకి అభిమానులుగా నటిస్తూ ఖరీదైన బహుమతులతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న “హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త”తో జట్లు, ఆటగాళ్ళు, కోచ్‌లు, కామెంటర్లను మాట్లొద్దని హెచ్చరించింది. ఈ మేరకు అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) నిఘాను ముమ్మరం చేసింది.
క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం..
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఐపీఎల్ టోర్నీలో పాల్గొనేవారితో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ACSU అనుమానిస్తోంది. అతడికి ఇప్పటికే బుకీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వీరాభిమానిగా నటిస్తూ రహస్యంగా ఆటగాళ్ళు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ACSU విశ్వసిస్తోంది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడినట్టు చరిత్ర కూడా ఉందట.. అందుకే ఐపీఎల్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరినీ ACSU గట్టిగా హెచ్చరించింది.
ఈ హైదరాబాదీ ఐపీఎల్ ఆటగాళ్లను ఎలాగైనా సంప్రదించేందుకు ప్రయత్నిస్తే వెంటనే తమకు రిపోర్టు చేయాలని బీసీసీఐ భద్రతా విభాగం హెచ్చరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఖరీదైన బహుమతులు, ఖరీదైన ఆభరణాలు, ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానాలు, ఆటగాళ్ల కుటుంబాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారట.
అలాగే, ఆ వ్యాపారవేత్త విదేశాలలో నివసిస్తున్న బంధువులతో సోషల్ మీడియా ద్వారా సంప్రదించేందుకు కూడా ప్రయత్నించాడని రిపోర్టు తెలిపింది. దాంతో ఐపీఎల్ వర్గాల్లో తీవ్రమైన ఆందోళనలను రేకిత్తిస్తోంది.
ఆ వ్యాపారవేత్త ఇప్పటికే జట్టు హోటళ్లలో, మ్యాచ్ జరిగే ప్రాంతాల్లో కనిపించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కొంతమంది అంతర్గత వ్యక్తులు, ఆటగాళ్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా బహుమతులు, విందు ఆహ్వానాలు, షాపింగ్‌కు తీసుకెళ్లమని ఆఫర్‌లతో సంప్రదించాడని అనుమానిస్తున్నారు.
Read Also : Honda Dio 125 : కొత్త స్కూటర్ కొంటున్నారా? హోండా డియో 125 స్కూటర్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
ఇవన్నీ తనను తాను ఒక ఐపీఎల్ అభిమానిగా పరిచయం చేసుకుంటూ ప్రలోభపెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని నివేదికలు పేర్కొన్నాయి. ఇది ఒక్కసారిగా క్రికెట్ వర్గాలను కలవరపెట్టింది.
బీసీసీఐ కఠిన చర్యలు :
అంతర్గత భద్రతా ప్రోటోకాల్‌లను కఠినతరం చేయాలని బీసీసీఐ ఫ్రాంచైజీలను కోరింది. అన్ని వాటాదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని, బహుమతులు స్వీకరించకుండా ఆయా వ్యక్తులను, ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చే వారిని కలవకుండా ఉండాలని సూచిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్టు తమకు సమాచారం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.