Michael Bracewell comments after New Zealand win ODI series against India
Michael Bracewell : సమిష్టిగా రాణించడమే తమ విజయ రహస్యం అని న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ అన్నాడు. భారత గడ్డపై మొదటి సారి వన్డే సిరీస్‌ను గెలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఆదివారం ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) లు శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (124) సెంచరీతో కదం తొక్కాడు. నితీశ్‌కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) లు హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికి మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో జాక్ ఫౌక్స్, క్లార్క్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. లెనాక్స్ రెండు వికెట్లు సాధించాడు. కైల్ జేమిసన్ ఓ వికెట్ తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం సిరీస్ విజయం పై న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత్ వచ్చి ఆడడం ఎల్లప్పుడూ ఎంతో ఒత్తిడితో కూడుకున్న విషయం అని చెప్పాడు. అయినప్పటికి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకంగా ఉందన్నాడు. ఇక్కడకు వచ్చి మంచి క్రికెట్ ఆడాలని తాము భావించామని, ఓ జట్టుగా మా బలాలను నమ్మి, సమిష్టిగా రాణించేందుకు ప్రయత్నించామన్నాడు. ఇక విదేశీ పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరీక్షించుకోగలగడం అద్భుతంగా ఉందన్నాడు.
న్యూజిలాండ్ జట్టు గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలో మాది ఓ చిన్న దేశం. అయినప్పటికి పెద్ద జట్లతో పోటీపడేందుకు ఇష్టపడుతాం. మేము ఎప్పుడూ కూడా ఓ బృందంగా కలిసి ఆడుతాం. ఒకరికొకరు అండగా నిలబడతాము. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అని బ్రేస్‌వెల్ అన్నాడు.
Shubman Gill : సిరీస్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..
ఇక డారిల్ మిచెల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతను గత కొన్నేళ్లుగా వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు బాధ్యత తీసుకుని బ్యాటింగ్ విభాగానికి నాయకత్వం వహించాడని తెలిపాడు. అతడు ఎంతో వినయంగా ఉంటాడని అన్నాడు. తనదైశిలో రాణించి.. అందుకు తగ్గ ప్రతి ఫలం పొందడం చాలా బాగుందన్నాడు. ఇక కొత్త ఆటగాళ్ల అరంగ్రేటం పై మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియాల్లో ఈ సిరీస్‌లో ముగ్గురు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయడం చాలా బాగుందన్నాడు. అరంగ్రేట ఆటగాళ్లు కూడా ఎంతో బాగా ఆడారని, వాళ్లు తమ న్యూజిలాండ్ క్రికెట్ డెప్త్‌ను పెండచం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.