Shubman Gill : సిరీస్ ఓట‌మిపై శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..

న్యూజిలాండ్ చేతిలో వ‌న్డే సిరీస్ ఓడిపోవ‌డం పై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ (Shubman Gill )స్పందించాడు.

Shubman Gill : సిరీస్ ఓట‌మిపై శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌.. మా దృష్టి అంతా దానిపైనే.. అందుకే ఇలా..

Shubman Gill comments after india lost to ODI series to New Zealand

Updated On : January 19, 2026 / 9:56 AM IST
  • న్యూజిలాండ్ పై వ‌న్డే సిరీస్ ఓట‌మి
  • 2-1 తేడాతో
  • సిరీస్ ఓట‌మిపై టీమ్ఇండియా కెప్టెన్ గిల్ కామెంట్స్‌

Shubman Gill : సొంతగడ్డపై టీమ్ఇండియాకు చేదు అనుభవం. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కోల్పోయింది. బంతి, బ్యాట్‌తో ఘోరంగా విఫ‌ల‌మైన శుభ్‌మ‌న్ గిల్ సేన ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో 41 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చవిచూసింది. ఫ‌లితంగా 2-1 తేడాతో కివీస్ వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 337 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్‌ మిచెల్‌ (137; 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వరుసగా రెండో శ‌త‌కం బాద‌గా గ్లెన్‌ ఫిలిప్స్‌ (106; 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ సింగ్, హ‌ర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం విరాట్‌ కోహ్లి (124; 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వీరోచిత సెంచ‌రీకి తోడు నితీశ్‌కుమార్‌ రెడ్డి (53; 57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), హర్షిత్ రాణా (52; 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలతో రాణించిన‌ప్ప‌టికి భార‌త్ 46 ఓవ‌ర్ల‌లో 296 ప‌రుగుల‌కు ఆలౌటైంది. జాక్‌ ఫౌక్స్‌, క్లార్క్ లు చెరో మూడు వికెట్లు తీశారు. లెనాక్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కైల్ జేమిస‌న్ ఓ వికెట్ సాధించాడు.

ఇక సిరీస్ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు. ‘సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించాం. రెండో మ్యాచ్‌లో ఓడిపోయాం. దీంతో ఇక్క‌డి వ‌చ్చే సరికి సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. అయితే.. ఈ రోజు మేము ఆడిన తీరు చూస్తే కొంచెం నిరాశ‌గా ఉంది.’ అని గిల్ అన్నాడు.

ఆ స్థానంలో వ‌చ్చి ఆడ‌డం అంత తేలిక కాదు..

ఈ సిరీస్ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌ని, తాము మెరుగుప‌డాల్సిన అంశాలు చాలా ఉన్నాయ‌న్నాడు. ఇక ఈ సిరీస్ నుంచి కొన్ని సానుకూల అంశాలు సైతం ఉన్నాయ‌న్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతం. అత‌డు ఆడే విధానం ఎప్ప‌టికి సానుకూల అంశ‌మేన‌ని అన్నాడు. ఇక ఈ సిరీస్‌లో హ‌ర్షిత్ రాణా ఆడిన తీరు ఆక‌ట్టుకుంద‌న్నాడు. ఎనిమిదో స్థానంలో వ‌చ్చి ఆడ‌డం చాలా బాగుంద‌న్నాడు.

ఆ స్థానంలో వ‌చ్చి ఆడ‌డం అంత తేలిక కాద‌ని, అయిన‌ప్ప‌టికి అత‌డు రాణించిన విధానం బాగుంద‌న్నాడు. ఇక పేస‌ర్ల గురించి మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో మన ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు చాలా బాగుందన్నాడు. ఇక ఆల్ రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని, అది ఎక్క‌డ జ‌ర‌గ‌బోతుందో తెలుసు కాబ‌ట్టి.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకునే నితీశ్‌ కుమార్‌ రెడ్డికి అవ‌కాశాలు ఇస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌లో అత‌డికి అనుభ‌వం రావ‌డం కోసం మ‌రిన్ని ఓవ‌ర్లు అత‌డితో వేయించాల‌ని అనుకుంటున్నామ‌ని, అదే విధంగా అత‌డు సాధ్య‌మైన‌న్ని ఎక్కువ బంతులు ఆడేలా బ్యాటింగ్ స్థానాన్ని మారుస్తున్నామ‌ని అన్నాడు.

ఏదీ ఏమైన్ప‌ప‌టికి కూడా ప్ర‌పంచ‌క‌ప్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నామ‌ని, అందులో నితీశ్ కూడా భాగం అని అన్నాడు.