కొడుకు కోసం వాటర్ బాయ్‌గా మారిన రికీ పాంటింగ్.. తండ్రి బాటలో జూనియర్ పాంటింగ్.. వీడియో వైరల్

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 నెట్ సెషన్ సందర్భంగా తీసిన ఈ తండ్రీకొడుకుల వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ప్రపంచ కప్ హీరో రికీ పాంటింగ్‌ కొత్త అవతారం ఎత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కుమారుడు ఫ్లెచర్ కోసం ఏకంగా వాటర్ బాయ్‌గా మారారు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 నెట్ సెషన్ సందర్భంగా తీసిన ఈ తండ్రీకొడుకుల వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

నెట్స్‌లో జూనియర్ పాంటింగ్

ప్రస్తుతం వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్.. తన కుమారుడు ఫ్లెచర్ విలియం పాంటింగ్‌కు బ్యాటింగ్ మెళకువలు నేర్పుతూ కనిపించారు. ఫ్లెచర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని టైమింగ్, టెక్నిక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తూ గ్లెన్ మాక్స్‌వెల్ అతనికి త్రోడౌన్స్ వేయడం విశేషం.

ఒక కోచ్‌గానే కాకుండా, ఒక తండ్రిగా పాంటింగ్ పక్కనే నిలబడి.. ఏకాగ్రతతో గమనిస్తూ తన కుమారుడికి విలువైన సలహాలు ఇచ్చారు. ప్రాక్టీస్ మధ్యలో ఫ్లెచర్‌కు దాహం వేసినప్పుడు పాంటింగ్ స్వయంగా వాటర్ బాటిల్ అందిస్తూ “వాటర్ బాయ్” అవతారం ఎత్తారు. ఈ దృశ్యం చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఫ్లెచర్ కూడా తండ్రి బాటలోనే నడిచి భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతాడేమోనని ఫ్యాన్స్ అంటున్నారు.

కోచ్‌గా పాంటింగ్ అదుర్స్

ఒకవైపు కొడుకుకు శిక్షణ ఇస్తూనే, మరోవైపు హెడ్ కోచ్‌గా పాంటింగ్ తన జట్టును విజయ పథంలో నడిపిస్తున్నారు. ఇటీవలే లాస్ ఏంజిలిస్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో వాషింగ్టన్ జట్టు 6 మ్యాచ్‌లలో 10 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైంది.

కాగా, IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా పాంటింగ్‌ తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్‌ ఓడిపోయింది. ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో టైటిల్ గెలిచి ఆ నిరాశను దూరం చేసుకోవాలని పాంటింగ్ పట్టుదలతో ఉన్నాడు.