Mohammad Rizwan comments : అందుకే ఓడిపోయాం.. లేదంటేనా.. విండీస్‌తో సిరీస్ ఓటమిపై పాక్ కెప్టెన్ రిజ్వాన్ కామెంట్స్..
వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఓటమి పై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడాడు(Mohammad Rizwan comments).

Mohammad Rizwan comments after West Indies win the ODI series after 34 years against Pakistan
Mohammad Rizwan comments : వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. దాదాపు 34 ఏళ్ల తరువాత పాక్ జట్టు పై విండీస్ వన్డే సిరీస్ గెలవడం గమనార్హం. మంగళవారం జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) అజేయ సెంచరీ చేశాడు. మిగిలిన వారిలో జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 పరుగులు), ఎవిన్ లూయిస్ (54 బంతుల్లో 37 పరుగులు), రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 36 పరుగులు) లు రాణించారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు సాధించారు. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సల్మాన్ అఘా (30), మహ్మద్ నవాజ్ (23), హసన్ నవాజ్ (13) లు రెండు అంకెల పరుగులు సాధించారు. మిగిలిన వారిలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు. స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం కూడా 9 పరుగులే చేశాడు.
బ్యాటింగ్ వైఫల్యమే..
మూడో వన్డేలో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan comments) మాట్లాడాడు. టాప్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని వివరించాడు. విండీస్ బ్యాటర్ షై హోప్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి పవర్ హిట్టింగ్ అద్భుతం అని, తమని కోలుకోనీయకుండా చేశాడన్నారు.
‘ఈ పిచ్ పై మూడో మ్యాచ్ అన్న సంగతి మాకు తెలుసు. ఈ మ్యాచ్‌లో 40 ఓవర్ల పాటు మేము ఆధిక్యంలోనే ఉన్నాము. విండీస్‌ను 220 లోపు కట్టడి చేస్తామని అనుకున్నాం. మైదానంలో మా వ్యూహాలను సరిగ్గానే అమలు చేశాం. అయితే.. కొన్ని ఎడ్జ్‌లు మాకు కలిసి రాలేదు. షై హోప్ చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. అతడి హిట్టింగ్ బాగుంది.’ అని రిజ్వాన్ అన్నాడు.
Worst Leave Of The Year : వరస్ట్ లీవ్ ఆఫ్ ది ఇయర్.. రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ వీడియో వైరల్..
సైమ్, సల్మాన్ బౌలింగ్ చేయగలరని, అందుకనే ఐదుగురు బౌలర్లను తుది జట్టులోకి తీసుకోలేదన్నాడు. ప్రణాళిక ప్రకారం అబ్రార్‌తో ఆలస్యంగా బౌలింగ్ వేయించాలని అనుకున్నామని, అయితే.. విండీస్ హిట్టింగ్ కారణంగా అతడితో పూర్తి ఓవర్లు వేయించలేకపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లోనే కాదని, సిరీస్ ఆసాంతం అతడు ఇబ్బంది పెట్టినట్లు తెలిపాడు.