Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై ఆఖరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో చెన్నై మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ చెన్నై విజయం సాధించినా కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే. ఇక ఇదే అభిప్రాయం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాటల్లోనూ కనిపించింది. ఐపీఎల్ 2026 కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతాం అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
ముంబై ఇండియన్స్ పై ఓటమి అనంతరం ధోని మాట్లాడుతూ.. మరోసారి బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో మేము చాలా తక్కువ స్కోరు చేశాము. మరో 20 నుంచి 25 పరుగులు చేయాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని తెలుసు. మిడిల్ ఓవర్లలో ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది.’ అని ధోని అన్నాడు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో ఒకే ఒక భారతీయుడు..
ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒకడని కితాబు ఇచ్చాడు. ‘ఇక బుమ్రా పరుగులు ఇవ్వడం కలిసొచ్చింది. అయితే.. మిడిల్ ఓవర్లలో ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉంది. ఈ పిచ్ పై 175 పరుగులు లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదు.’ అని ధోని చెప్పాడు.
ఇక యువ ఆటగాడు ఆయుష్ మాత్రే పై ప్రశంసల జల్లు కురిపించాడు ధోని. అతడు చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడన్నాడు. అతడి ఆటను ఎక్కువగా చూడలేదని, ఇలాగే మంచి ఆటతీరును కొనసాగిస్తే అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నాడు. మంచి క్రికెట్ ఆడితేనే గెలుస్తాం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నాడు. గొప్పగా ఆడనప్పుడు భావోద్వేగానికి గురి కాకూడదన్నాడు. ఇలాంటి పరిస్థితులను గతంలోనే చూశామని చెప్పుకొచ్చాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. నాకు ఈ అవార్డు వొద్దు.. అసలెందుకు ఇచ్చారో తెలియదు
2020 సీజన్ సైతం సీఎస్‌కేకు కలిసిరాలేదన్నాడు. అయితే.. ఆ తరువాతి ఏడాది మాత్రం అనుకున్న ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసినట్లుగా తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో కూడా ఏదీ కలిసి రావడం లేదన్నాడు. ఇక నుంచి ఒక్కొ మ్యాచ్ ఫలితం పై మాత్రమే దృష్టి పెడుతామన్నాడు. ఎక్కువగా టీమ్‌లో మార్పులు అవసరం లేదన్నాడు. నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తే సరిపోతుందన్నాడు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తాం. అలా కుదరని పక్షలంలో వచ్చే సీజన్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకుంటాం. బలంగా తిరిగి వస్తాం అని ధోని చెప్పాడు.