మ్యాచ్ గెలిచాక.. తన ఆటతీరు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కోహ్లీ

Virat Kohli: భవిష్యత్తులో జరగబోయే టీ20 టోర్నీల్లోనూ తానే హీరోనని చాటి చెప్పాడు.

Virat Kohli @IPL

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బ్యాటు పట్టిన స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై అద్భుతమైన షాట్లు ఆడాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

టీ20ల్లో వందోసారి 50 కంటే ఎక్కువ స్కోరును చేసిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఆటతీరు ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్-2024 ఆరెంజ్ క్యాప్ రేస్ లో ప్రస్తుతం కోహ్లీ ముందంజలో ఉన్నాడు.

ఈ సందర్భంగా కోహ్లీ తన గురించి, ఫ్యాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘అత్యుత్సాహం వద్దు.. రెండు మ్యాచులు మాత్రమే జరిగాయి. ఎంత కష్టపడితే ఆరెంజ్ క్యాప్ వస్తుందో నాకు తెలుసు. ఆట గురించి జనాలు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు.

చివరకు విజయాలు, గణాంకాల గురించి కాకుండా మెమొరీస్ గురించే మాట్లాడతారు. స్నేహం, ప్రేమ, ప్రశంసలు, మద్దతు.. ఇవన్నీ చాలా బాగుంటాయి. వాటిని మనం భవిష్యత్తులో కోల్పోవచ్చు.. కానీ వాటిని ఎన్నటికీ మర్చిపోలేమని రాహుల్ ద్రవిడ్ చెబుతుంటారు. టీ20ల్లో నేను ఓపెనర్ గా దిగుతుంటాను.

టీమ్ కి శుభారంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వికెట్లు పడుతున్నాయంటే ఫ్యాన్స్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఈ మ్యాచులో లైన్‌లో షాట్లు కొట్టడం కాకుండా మరో రకంగా సరైన విధంగా షాట్‌లు ఆడాల్సి వచ్చింది. కొన్ని ప్రయత్నాలు చేశాను. మరొక ఎండ్‌లో నాకు పెద్ద హిట్‌లు కావాలనిపించింది. మ్యాక్సీ, అనూజ్ త్వరగా ఔట్ అయ్యారు. నిరాశ చెందాను.

నేను రెండు నెలల తర్వాత క్రికెట్ ఆడాను. అయినా రాణించాను. నేను కవర్ డ్రైవ్‌ను బాగా ఆడతానని బౌలర్లకు బాగా తెలుసు. కాబట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తారు. ప్రణాళికకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది. ప్రపంచంలో టీ20 గేమ్ ను ప్రమోట్ చేయడానికే నా పేరును తరుచూ వాడారని నాకు తెలుసు. టీ20 క్రికెట్లో ఇప్పుడూ అదే జరుగుతోంది’ అని అన్నాడు. భవిష్యత్తులో జరగబోయే టీ20 టోర్నీల్లోనూ తానే హీరోనని చాటిచెప్పాడు కోహ్లీ. కాగా, మ్యాచులో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా, బెంగళూరు టీమ్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది.