×
Ad

Nandani Sharma : ఎవ‌రీ నందిని శ‌ర్మ‌? డ‌బ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ పేస‌ర్..

మహిళల ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌)లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత పేసర్‌గా నందిని శర్మ (Nandani Sharma) చ‌రిత్ర సృష్టించింది.

Nandani Sharma becoming the first Indian pacer to take a hat trick in the WPL

  • డ‌బ్ల్యూపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు ప‌డ‌గొట్టిన నందిని శ‌ర్మ‌
  • ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త పేస‌ర్‌
  • డ‌బ్ల్యూపీఎల్ చ‌రిత్ర‌లో నాలుగో ప్లేయ‌ర్‌గా

Nandani Sharma : మహిళల ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌)లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత పేసర్‌గా నందిని శర్మ చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబై వేదిక‌గా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల ఈ ఢిల్లీ క్యాపిటల్స్ పేస‌ర్ ఈ ఘ‌న‌త అందుకుంది. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో నందిని 33 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టింది. మొత్తంగా డ‌బ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఆమె కంటే ముందు ఇస్సీ వాంగ్ (ముంబై ఇండియన్స్), గ్రేస్ హారిస్ (UP వారియర్జ్), దీప్తి శర్మ (UP వారియర్జ్) లు ఈ ఘ‌న‌త సాధించారు.

గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్ (20వ ఓవ‌ర్‌) లో నందిని హ్యాట్రిక్ సాధించింది. ఆఖ‌రి మూడు బంతుల్లో కనికా అహుజా, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా సింగ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ న‌మోదు చేసింది.

Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు.. సిక్స‌ర్ల కింగ్ హిట్‌మ్యాన్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 209 ప‌రుగుల‌కు ఆలౌటైంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సోఫీ డివైన్‌ (95; 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకుంది. ఆష్లీ గార్డ్‌నర్‌ (49) రాణించింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నందిని శర్మ ఐదు వికెట్లు తీసింది. చినెల్ హెన్రీ, శ్రీచ‌ర‌ణిలు చెరో రెండు వికెట్లు తీశారు. షఫాలీ వ‌ర్మ ఓ వికెట్ సాధించింది.

అనంత‌రం లిజెలీ లీ (86; 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), వోల్వార్ట్‌ (77; 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టిన‌ప్ప‌టికి కూడా 210 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో గుజ‌రాత్ 4 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సోఫీ డివైన్‌, రాజేశ్వరిలు చెరో రెండు వికెట్లు తీశారు.

ఎవ‌రీ నందిని శ‌ర్మ ?

2001లో జ‌న్మించిన నందిని శ‌ర్మ ఛండీగ‌డ్‌కు చెందింది. ఆమె త‌న పేస్ బౌలింగ్‌తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా దేశ‌వాళీ టీ20 క్రికెట్‌లో త‌న బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూపీఎల్ వేలంలో ఆమెను ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు 20 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకుంది.

IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క ప‌ని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్

హ్యాట్రిక్ తీయ‌డం పై ఆనందాన్ని వ్య‌క్తం చేసింది నందిని శ‌ర్మ‌. త‌న‌కు ఎంతో మ‌ద్ద‌తుగా నిలుస్తున్న కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. తాను హ్యాట్రిక్ సాధించిన స‌మ‌యంలో త‌న త‌ల్లి, సోద‌రుడు, స్నేహితురాళ్లు మైదానంలో ఉన్నార‌ని, వారంద‌రి ముందు ఈ ఘ‌న‌త సాధించ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చిన‌ట్లు చెప్పుకొచ్చింది.