వాహ్: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన యువ క్రికెటర్

బ్రేక్ చేయడానికే కదా రికార్డుండేది. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులకు లెక్కే లేదు. టీనేజర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనితర సాధ్యమైన రికార్డులన్నీ కొల్లగొట్టేశాడు. అయితే సచిన్ పేరిట ఉన్న 29ఏళ్ల కిందట రికార్డును బ్రేక్ చేసి షాక్ చేశాడు ఈ నేపాలీ యువ క్రికెటర్ రోహిత్ పౌడేల్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా శనివారం నేపాల్-యూఏఈ మధ్య జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 16ఏళ్ల నేపాలీ క్రికెటర్ రోహిత్ పౌడెల్ 58 బంతుల్లో 55 పరుగులతో విజృంభించాడు. అతి చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
గతంలో సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు 16ఏళ్ల 213 రోజుల వయసులో ఫైసలాబాద్ వేదికగా జరిగిన వన్డేలో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. రోహిత్ అంతకంటే చిన్న వయస్సులో 16ఏళ్ల 146రోజులకే బ్రేక్ చేయడం విశేషం. సచిన్‌తో పాటు అఫ్రిది కూడా చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉంది. 16ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే 37 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. దీంతో రోహిత్.. సచిన్ రికార్డునే కాదు పాక్ క్రికెటర్ అఫ్రీది రికార్డును కూడా బ్రేక్ చేసినట్లు అయింది.
పురుషుల క్రికెట్ మాట అటుంచి మహిళా క్రికెట్ విషయానికొస్తే దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా క్రికెటర్ జోహ్‌మరి లాగ్టెన్‌బర్గ్ 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేలలో హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.