No Indian player wanted to play vs Pakistan says Suresh Raina
Suresh Raina : ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయినప్పటికి భారత జట్టు పాక్‌తో తలపడి అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ తరువాత ఆ ఫలితాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ టాస్ సమయంలోగానీ, మ్యాచ్ పూర్తి అయిన తరువాత కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మిగిలిన భారత ఆటగాళ్లు ఎవ్వరూ కూడా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ కు గట్టి బుద్ది చెప్పారని అంటున్నారు.
Asia Cup 2025 : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డు బ్రేక్..
అయితే.. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. అసలు పాక్‌తో మ్యాచ్ ఆడడం ఏ భారత క్రికెటర్‌కు కూడా ఇష్టం లేదట. ఈ విషయాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) తెలిపాడు. స్పోర్ట్స్ టాక్ తో జరిగిన చాట్ లో రైనా మాట్లాడుతూ.. పాక్‌తో ఆడడం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని, అయితే.. బీసీసీఐ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అంగీకరించినందున ప్లేయర్లు అందుకు కట్టుబడి ఉండడం తప్ప మరోమార్గం లేకపోయిందని చెప్పుకొచ్చాడు.
‘నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. ఆసియాకప్‌లో పాక్‌తో ఆడాలని ఉందా? లేదా? అనే విషయాన్ని మీరు ఆటగాళ్లను వ్యక్తిగతంగా అడిగితే వారు లేదనే సమాధానం ఇస్తారు. బీసీసీఐ టోర్నీలో ఆడతాడమని అంగీకరించింది. పాక్‌తో ఆడడం నన్ను బాధించింది. విజయం సాధించడం ఆనందంగా ఉన్నా కూడా.. అసలు ఆడకుండా ఉంటేనే ఇంకా ఎంతో బాగుండేది.’ అని రైనా అన్నాడు.
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాక్ సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ ఏడాది ఆసియాకప్ నిర్వహించాలా వద్దా అన్న దానిపైనా కూడా చర్చించారు. బీసీసీఐతో పాటు మిగిలిన అన్ని బోర్డులు కూడా టోర్నమెంట్ ముందుకు సాగడానికి అంగీకరించాయి.
పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడంతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సోషల్ మీడియాలోనైతే ఆగ్రహం వ్యక్తమైంది. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాక్‌తో ఆడుతున్నామని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.