India vs Pakistan
India Vs Pakistan Match : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీలో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో దాయాది జట్లయిన భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ లోని ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. పాక్ పై మరోసారి విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించాలని భారత్ ఆటగాళ్లు సన్నద్దమవుతుండగా.. వరల్డ్ కప్ లో భారత్ పై వరుస ఓటములకు బ్రేక్ వేస్తామని పాక్ జట్టు ధీమాతో ఉంది. వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్లు మొత్తం ఏడు సార్లు తలపడగా.. ఏడు సార్లు భారత్ జట్టే విజయం సాధించింది. ఇవాళ ఎనిమిదో సారి ఇరు జట్లు తలపడనున్నాయి.
babar azam and virat kohli
భారత్ జట్టు బలాలు ఇవే..
భారత్, పాకిస్థాన్ జట్లలో అవకాశం దొరికితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయతీరాలకు నడిపించగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్లు వరుస విజయాలతో జోరుమీదున్నాయి. అయితే, భారత్ జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్ అని చెప్పొచ్చు. పాకిస్థాన్ మ్యాచ్ అంటే మన బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ లోశుభ్ మన్ గిల్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాఅయితే భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతం అయినట్లే. రోహిత్, గిల్ లేదా ఇషాంత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్ధిక్, జడేజా లతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది.
బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా, సిరాజ్ లు రాణిస్తున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకే అనుకూలిస్తుంది. దీంతో కుల్ దీప్ కీలకంగా మారే అవకాశం ఉంది. గతంలో పాకిస్థాన్ తో ఆడిన ఐదు మ్యాచ్ లలో కుల్ దీప్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్ లో కుల్ దీప్ నుంచి పాక్ బ్యాటర్లకు ఇబ్బందికర పరిస్థితి ఖాయమని చెప్పొచ్చు. మరోవైపు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగితే అశ్విన్ తుది జట్లులో చేరే అవకాశం ఉంది. అలాకాకుండా మూడో పేసర్ ను బరిలోకి దింపితే షమిని తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.
india vs pakistan
పాక్ చరిత్ర సృష్టిస్తుందా..?
వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ భారత్ జట్టుపై ఒక్కసారికూడా విజయం సాధించలేదు. ఇవాళ్టి మ్యాచ్ లో ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ కు ప్రధాన బలం బౌలింగ్. ఈ జట్టులో కొందరు ప్రమాదకరమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంగా షహీన్ అఫ్రిది నుంచి భారత్ జట్టుకు ముప్పు పొంచిఉంటుంది. ఆరంభ ఓవర్లలో అఫ్రిది నుంచి వచ్చే వేగవంతమైన బంతులను ఎదుర్కోవటం కొంతకష్టమే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టాల్సి వస్తుంది.
పాక్ మరో బౌలర్ హారిస్ రవూఫ్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో అతడు ఒకరు. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ లోనూ సత్తాచాటుతుంది. పాక్ – శ్రీలంక మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని పాక్ అలవోకగా ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ క్రీజులో కుదురుకుంటే భారత్ బౌలర్లకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు. రిజ్వాన్ ఆ జట్టులో కీలక బ్యాటర్. శ్రీలంకతో మ్యాచ్ లో సెంచరీతో జట్టును విజయతీరాలను నడిపించాడు. రిజ్వాన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండగా.. అబ్దుల్లా షఫీక్ దుకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో షకీల్, ఇఫ్తికార్ లు క్రీజులో పాతుకుపోతే పాక్ పరుగుల వరద పారించటం ఖాయంగా చెప్పొచ్చు.
All in readiness for #INDvPAK ???#TeamIndia | #CWC23 | #MeninBlue pic.twitter.com/sSvHS3xESB
— BCCI (@BCCI) October 13, 2023
డెంగీ ఫీవర్ కారణంగా వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన భారత్ యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ పాక్ తో మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు రోజులుగా గిల్ అహ్మదాబాద్ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పాక్ తో మ్యాచ్ లో గిల్ ఆడే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. 90శాతం గిల్ తుది జట్టులో చేరే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో గిల్ మైదానంలో దిగడం ఖాయమని తెలుస్తోంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.
తది జట్లు అంచనా..
భారత్ జట్టు : రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, కే.ఎల్. రాహుల్, హార్థిక్ పాండ్యా, జడేజా, షమీ/అశ్విన్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
పాకిస్థాన్ జట్టు : బాబర్ అజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమామ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్, రవూఫ్.