Team India: టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు.. ఎక్కడంటే?

వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.

Indian Cricket fans at Madurai offer prayers for Team India victory

IND vs NZ: వన్డే ప్రపంచకప్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు మొదటి సైమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా విజయం సాధించి ఫైనల్ చేరాలని ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మెగా టోర్నిలో ఇప్పటివరకు 9 విజయాలతో జైత్రయాత్ర సాగించిన రోహిత్ సేన జోరు కొనసాగించాలని క్రికెట్ అభిమానలు ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు.

 మదురై జల్లికట్టు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో…
వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ విజయం సాధించాలని కోరుకుంటూ తమిళనాడులోని మదురైలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదురై జల్లికట్టు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ ప్రార్థనలు ఫలించి టీమిండియా సాధిస్తుందన్న నమ్మకాన్ని మదురై జల్లికట్టు రోటరీ క్లబ్ అధ్యక్షుడు బల్లూ వ్యక్తం చేశారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఆశావాద దృక్పథం, గాఢమైన దేశభక్తితో తాము చేసిన ప్రార్థనలు టీమిండియాకు విజయాన్ని అందిస్తాయని అన్నారు. మన జట్టు గెలిచి దేశం గర్వించేలా చేయాలని అభిలషించారు.

 

ఉదయం నుంచే సందడి వాతావరణం
ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయకుడి ఆలయంలోనూ టీమిండియా అభిమానులు ఈరోజు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఈసారి టీమిండియా బాగా ఆడుతోందని ప్రపంచకప్ టైటిల్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు వాంఖడే స్టేడియం వద్ద ఉదయం నుంచే సందడి వాతావరణం కనిపిస్తోంది. మ్యాచ్ ప్రారంభమయ్యేది మధ్యాహ్నం అయినా ప్రేక్షకులు ఉదయం నుంచే స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. జాతీయ పతకం, ప్రపంచకప్ నమూనా చేతబూని టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

 

శక్తిపీఠ్ అంబాజీ ఆలయంలోనూ…
గుజరాత్ బనస్కాంతలోని శక్తిపీఠ్ అంబాజీ ఆలయంలోనూ ఇండియా క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమిండియా విజయం కోసం మాతా అంబానీని ప్రార్థించినట్టు అభిమానులు తెలిపారు. గతంలో తాము అమ్మవారిని దర్శించుకోలేదని, ఈసారి మాత్రం ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. సెమీస్ తో పాటు ఫైనల్లోనూ టీమిండియా గెలవాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు.