Suryakumar Yadav : ముంబయి వీధుల్లో మారువేషంలో కెమెరామెన్ గా సూర్య.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? వీడియో వైరల్

పలువురి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. ఓ యువతి వద్దకు సూర్యకుమార్ వెళ్లాడు.. ఆమెను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి.. నేను సూర్యకుమార్ యాదవ్ ను అని అన్నాడు..

Suryakumar Yadav

ODI World Cup 2023 : టీమిండియా బ్యాటర్, మిస్టర్ 360గా పేరుగడించిన సూర్యకుమార్ యాదవ్ ముంబై మెరైన్ డ్రైవ్ లో విీడియో కెమెరాతో సందడి చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈనెల 2న (గురువారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు ముంబయి చేరుకున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ వీడియోగ్రాఫర్ అవతారమెత్తాడు. వీడియో కెమెరా తీసుకొని ముంబయిలోని ప్రముఖ రహదారుల్లో ఒకటైన మెరైన్ డ్రైవ్ కు వెళ్లాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ ఎవరూ గుర్తుపట్టకుండా మొఖానికి మాస్క్, నల్ల కళ్లద్దాలు, నెత్తిన టోపీ ధరించి వెళ్లాడు.

Also Read : ODI World Cup 2023: సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడానికి అవకాశమున్న జట్లు ఏవో తెలుసా..? పూర్తి వివరాలు ఇలా..

తొలుత హోటల్ గదిలో ఉన్న రవీంద్ర జడేజా వద్దకు వెళ్లాడు. మారువేషంలో కెమెరాతో ఉన్న సూర్యకుమార్ ను జడేజా గుర్తుపట్టలేకపోయాడు. ఆ తరువాత సూర్యా కెమెరాతో మెరైన్ డ్రైవ్ లోని క్రికెట్ ఔత్సాహికులతో ఇంటర్వ్యూలు చేయడంలో నిమగ్నమయ్యాడు. కెమెరాతో షూట్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తుంది సూర్యా అని తెలియని వారు తమ ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ షూట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి.. సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరును మెరుగుపర్చుకోవాలని చెప్పాడు. అతను సూర్యాతోనే మాట్లాడుతున్నట్లు తెలియదు. దీంతో నేను నిజంగా బిగ్గరగా నవ్వాలనుకుంటున్నాను అని సూర్య చెప్పాడు.

 

 

పలువురి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. ఓ యువతి వద్దకు సూర్యకుమార్ వెళ్లాడు.. ఆమెను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి.. నేను సూర్యకుమార్ యాదవ్ ను అని అన్నాడు.. ఆ యువతి నమ్మలేదు.. సూర్య మాస్క్ ను, తల టోపీని తీయగా యువతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.. వెంటనే అక్కడి వారు సూర్యతో సెల్ఫీలకోసం గుమ్మికూడటం వీడియోలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వినోద భరితమైన సూర్యకుమార్ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.