ODI World Cup 2023 awards : ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ గా కోహ్లీ.. ఎవ‌రెవ‌రికి ఏ అవార్డులు వ‌చ్చాయంటే..?

ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడు ఎవ‌రు..? అత్య‌ధిక వికెట్లు తీసింది ఎవ‌రు..? అన్నది ఇప్పుడు చూద్దాం..

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 టోర్నీ ముగిసింది. కోట్లాది మంది హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి. టోర్నీ ఆసాంతం వరుస విజ‌యాల‌తో రాణించిన టీమ్ఇండియా ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓట‌మి త‌ప్పిస్తే మిగిలిన అన్ని మ్యాచుల్లో టీమ్ఇండియా ఆట‌గాళ్లు అసాధార‌ణంగా పోరాడారు. కాగా.. ఇప్పుడు అంద‌రి దృష్టి ఒక్క‌దానిపైనే ఉంది. ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడు ఎవ‌రు..? అత్య‌ధిక వికెట్లు తీసింది ఎవ‌రు..? అన్నది ఇప్పుడు చూద్దాం..

విరాట్ కోహ్లీ..

పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతంగా రాణించాడు. టోర్నీ ఆసాంతం నిల‌క‌డ‌గా రాణించాడు. 11 మ్యాచుల్లో 765 ప‌రుగులు చేశాడు. ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కాడు. ఈ క్ర‌మంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా నిలిచాడు. ఈ మెగాటోర్నీలో కోహ్లీ మూడు సెంచ‌రీలు, ఆరు అర్ధ‌శ‌త‌కాలు బాదాడు.

సెమీ ఫైన‌ల్‌లో సెంచ‌రీ చేసిన కోహ్లీ, ఫైన‌ల్ మ్యాచులోనూ 54 ప‌రుగుల‌తో రాణించాడు. ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ప్ర‌జెంటేష‌న్ కార్య‌క్ర‌మంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నీ చేతుల మీదుగా ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.

Rohit Sharma : చేయాల్సిందంతా చేశాం.. ఇలా జ‌రిగి ఉండాల్సింది కాదు.. మ‌రో 20-30 ప‌రుగులు చేసుంటే..!

విరాట్ కోహ్లీ 765 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, ఆ త‌రువాత వ‌రుస‌గా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (597 ప‌రుగులు) ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు క్వింట‌న్ డికాక్ (594 ప‌రుగులు), న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర (578 ప‌రుగులు) ఉన్నారు.

ఇప్పటి వరకు జరిగిన టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాళ్లు వీరే..

మార్టిన్ క్రోవ్ (న్యూజిలాండ్‌) – 1992
సనత్ జయసూర్య (శ్రీలంక‌)- 1996
లాన్స్ క్లూసనర్ (ద‌క్షిణాఫ్రికా)- 1999
సచిన్ టెండూల్కర్ (భార‌త్‌)- 2003
గ్లెన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా) – 2007
యువరాజ్ సింగ్ (భార‌త్‌)- 2011
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 2015
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్‌) -2019
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 2023

Team India : అప్పుడు, ఇప్పుడు విల‌న్ ఆస్ట్రేలియానే.. భార‌త్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

ట్రావిస్ హెడ్‌..

ల‌క్ష్య ఛేద‌న‌లో ఒంటి చేత్తో ఆస్ట్రేలియా జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు ట్రావిస్ హెడ్‌. 240 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 137 ప‌రుగులు చేశాడు. శ‌త‌కంతో ఆస్ట్రేలియా ఆరో సారి ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ప్లేయ‌ర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఈ క్ర‌మంలో హెడ్ ఓ అరుదైన ఘ‌నత అందుకున్నాడు. సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌తో పాటు ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న నాలుగో ఆట‌గాడిగా ట్రావిస్ హెడ్ నిలిచాడు. భార‌త మాజీ ఆట‌గాడు మోహింద‌ర్ అమ‌ర్‌నాథ్‌, శ్రీలంక మాజీ ప్లేయ‌ర్ అర‌వింద డిసిల్వా, ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్ ఈ జాబితాలో ఉన్నారు. ఇక ట్రావిస్ హెడ్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ అంద‌జేశాడు.

అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ ఎవ‌రంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా మ‌హ్మ‌ద్ ష‌మీ నిలిచాడు. 7 మ్యాచులు మాత్ర‌మే ఆడిన ష‌మీ 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాతి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ జంపా ఉన్నాడు. జంపా 23 వికెట్లు తీశాడు.

ప్రపంచ కప్ 2023 గణాంకాలు..

అత్యధిక పరుగుల వీరుడు – విరాట్ కోహ్లీ (భార‌త్) – 765 ప‌రుగులు
అత్యధిక వ్యక్తిగత స్కోరు – గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 201నాటౌట్‌
అత్యధిక సెంచరీలు – క్వింటన్ డికాక్ (ద‌క్ష‌ణాఫ్రికా) – 4శ‌త‌కాలు
అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయ‌ర్‌ – రోహిత్ శర్మ (భార‌త్‌) – 31 సిక్స‌ర్లు
అత్యధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్ – మహ్మద్ షమీ (భార‌త్‌) – 24 వికెట్లు
అత్యుత్త‌మ‌ గణాంకాలు : మ‌హ్మ‌ద్‌ షమీ (భార‌త్‌) – 7/57
అత్యధిక ఔట్ల‌లో పాలుపంచుకున్న వికెట్ కీప‌ర్ – క్వింటన్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – 20 ఔట్లు
అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు – డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) -11 క్యాచులు

Mitchell Marsh : ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని అగౌర‌వ‌ప‌రిచిన మిచెల్ మార్ష్‌..! దుమ్మెత్తిపోస్తున్న నెటీజ‌న్లు..వాళ్ల‌ను చూసి నేర్చుకో..

ట్రెండింగ్ వార్తలు