Kohli 49th ODI Hundred
ODI World Cup 2023 : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49వ శతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ లో కోహ్లిలా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆటగాడు ప్రస్తుతం మరొకరు లేరు. కోహ్లీ ఆటతీరు అసామాన్యం. అతను ఒత్తిడికి చిత్తవడు. కోహ్లీ ఛేదనలో రారాజు. లక్ష్యం ఎంతున్నా, ఒకవైపు వికెట్లు పడుతున్నా.. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నా.. కోహ్లీ మాత్రం ఒక్కో పరుగు చేస్తూ ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధిస్తుంటాడు.
మ్యాచ్ కు ముందు మైదానంలో ఓ యువ అభిమాని కోహ్లీ పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. అయితే, కోహ్లీ మాత్రం పాదాలకు నమస్కరించవద్దంటూ యువకుడికి సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉంటే న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లలో స్వల్ప పరుగుల తేడాతో కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. న్యూజిలాండ్ పై 95 పరుగులు, శ్రీలంక జట్టుపై 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఔట్ అయ్యాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సచిన్ రికార్డును సమం చేస్తూ అరుదైన ఘనతను కోహ్లీ సాధించాడు.
ఇదిలాఉంటే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు హవా కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను పదిలం చేసుకుంది. నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియాలో థర్డ్ ప్లేస్ లో ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్లు నాల్గో స్థానంకోసం పోటీ పడుతున్నాయి.
Goosebumps Moment for Every Viratian?❤️#viratkohli #HappyBirthdayViratKohli pic.twitter.com/ccTZSTVWg1
— ?????? (@wrogn_edits) November 5, 2023