Bumrah-Razzaq
Abdul Razzaq-Bumrah : వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగాటోర్నీలో భారత పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. అయితే.. బుమ్రాను ఓ బేబీ బౌలర్ అని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ గతంలో అన్న వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై అబ్దుల్ రజాక్ తాజాగా వివరణ ఇచ్చాడు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అయితే.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
2019లో రజాక్ ఏమన్నాడంటే..?
అబ్దుల్ రజాక్ పాకిస్థాన్ తరుపున 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. 2013లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అయితే.. 2019లో ఓ ఇంటర్వ్యూలో అతడికి బుమ్రాను ఎదుర్కోవాల్సి వస్తే అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఇలా సమాధానం చెప్పాడు. తాను చాలా మంది గొప్ప బౌలర్లతో కలిసి ఆడినట్లు చెప్పాడు. గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్.. ఇలా ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నానని, వారి ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అని అన్నాడు. బుమ్రా బౌలింగ్‌ను తాను సులువుగా ఎదుర్కొగలనని అనుకుంటున్నట్లు చెప్పాడు. అతడి పై ఆధిపత్యం ప్రదర్శించి పరుగులు రాబట్టగలను అని అన్నాడు.
తప్పుగా అర్థం చేసుకున్నారు
తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో అబ్దుల్ రజాక్ పాల్గొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో బుమ్రా రాణిస్తున్న తీరును ప్రశంసిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యల పై స్పందించాలని అబ్దుల్ రజాక్ ను కోరారు. దీనిపై రజాక్ స్పందించారు. అప్పట్లో తాను వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ ఇంటర్వ్యూలో గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్, బుమ్రా, షోయబ్ అక్తర్ వంటి వారి బౌలింగ్‌లో తాను ఎలా ఆడతాననే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానంగా.. వారి ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అని చెప్పాను. బుమ్రా మంచి బౌలర్ కాదని తానెప్పుడు చెప్పలేదన్నాడు. వారితో పోల్చి చూసినప్పుడు పిల్లవాడు అనే అర్థం వచ్చేలా చెప్పినట్లు తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నాడు. పాకిస్థాన్ జట్టులో అరంగ్రేటం చేసిన సమయంలో తాను వసీమ్ అక్రమ్ ముందు ఓ బేబీ బౌలర్‌నే అని రజాక్ అన్నాడు.