Inzamam Ul Haq Resignation : పాకిస్థాన్ క్రికెట్​కు బిగ్ షాక్.. చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ రాజీనామా.. ఎందుకంటే?

పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేయడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఇంజమామ్ కు చెందిన ఏజెన్సీ తరపున ..

Inzamam Ul Haq Resignation

ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. మెగాటోర్నీలో ఆ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ జట్టుపైసైతం ఓడిపోవటంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు సెమీస్ కు చేరుకోవటం దాదాపు కష్టంగా మారింది. పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శన నేపథ్యంలో టోర్నీ ముగిసిన తరువాత జట్టుతో పాటు సెలెక్షన్ కమిటీలో మార్పులు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల పేర్కొంది. కెప్టెన్ బాబర్ అజామ్ ను తొలగిస్తారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ సెలెక్టర్ గా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశాడు. రాజీనామా లేఖను పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ కు పంపించాడు.

Also Read : Mohammed Shami : దిగ్గ‌జాల రికార్డుకు అడుగుదూరంలో ష‌మీ.. ఇదే ఫామ్‌తో ఇంకొక్క‌ మ్యాచ్ ఆడితే..

రాజీనామాకు కారణం ఇదేనా?
పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేయడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఇంజమామ్ కు చెందిన ఏజెన్సీ తరపున ఆటగాళ్లకే జట్టులోకి తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీబీ నిర్ణయంపై ఇంజమామ్ స్పందించారు. కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఆ ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకోవాలి. ఈ అంశంపై పీసీబీ విచారణ చేయాలని అన్నారు. విచారణ సందర్భంగాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇంజమామ్ తెలిపారు.

Also Read : ODI World Cup 2023 : గంభీర్ కామెంట్స్‌.. రోహిత్ అలాంటి వాడే.. పీఆర్ టీమ్‌లు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న చేయ‌వు

నిర్ధోషిగా తేలితే మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తా..
పీసీబీ నియమించిన కమిటీ విచారణలో నేను నిర్ధోషిగా తేలితే మళ్లీ చీఫ్ సెలెక్టర్ గా తన పాత్రను స్వీకరిస్తానని ఇంజమామ్ చెప్పారు. ఏజెన్సీతో సంబంధం ఉన్నట్లు నాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ కమిటీ పారదర్శకంగా విచారణ జరిపేందుకు నేను చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీమా చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. ఇదిలాఉంటే యుజో ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్ వాటాదారుగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రీది మరికొంత మంది ప్లేయర్స్ కు ఈ సంస్థతో అనుబంధం ఉంది.