Khushdil Shah: వరుస ఓటములు.. అభిమానులపై దాడికి యత్నించిన పాక్ క్రికెటర్.. వీడియో వైరల్.. స్పందించిన పీసీబీ

తాజా ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. విదేశీ ప్రేక్షకులు పాక్ ఆటగాళ్ల పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించింది.

Khushdil Shah

Khushdil Shah: పాకిస్థాన్ తో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం ఆఖఱి మ్యాచ్ లో కివీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఖుష్‌దిల్ షా ఆ దేశ క్రికెట్ అభిమానులపైనే దాడికి దిగాడు.

Also Read: IPL 2025: పంజాబ్ కింగ్స్ ఎవరి వల్ల ఓడిపోయింది..? కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఏం చెప్పాడంటే..

బే ఓవెల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో పాక్ ప్లేయర్ల ఆటతీరుపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురయ్యారు. దీంతో డగౌట్ లో ఉన్న ఖుష్‌దిల్ షాని టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వారు దుర్భాషలాడుతుండగా ఆపమని ఖుష్‌దిల్ షా కోరారు. అయినా వాళ్లు వినకపోవటంతో సహనం కోల్పోయిన ఖుష్‌దిల్ పాక్ అభిమానిపైకి దూసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించిన వారిలో అఫ్గానిస్థాన్ కు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది.

Also Read: NZ vs PAK: పాక్-కివీస్ మ్యాచ్.. బాల్ వేస్తుండగా పవర్ కట్.. పాక్ బ్యాటర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. విదేశీ ప్రేక్షకులు పాక్ ఆటగాళ్ల పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించింది. ‘‘పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్థాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని పీసీబీ తెలిపింది.

 

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు క్రికెట్ ఖుష్దిల్ షా జోక్యం చేసుకొని వారిని వారించే ప్రయత్నం చేశాడు. దీనికి ప్రతిస్పందనగా ప్రేక్షకులు మరింత అనుచితమైన భాషను ఉపయోగించారు. పాకిస్థాన్ జట్టు ఫిర్యాదు మేరకు స్టేడియం అధికారులు జోక్యం చేసుకొని పాక్ క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించారని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది.