Pakistan key players suffer from fever
ODI World Cup : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ను రెండు విజయాలతో ఆరంభించింది పాకిస్థాన్. అయితే.. మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ బెంగళూరుకు చేరుకుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టక ముందే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ బారిన పడినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.
కీలక ఆటగాళ్లు అయిన షహిన్ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, ఉసామా మీర్ లు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు అందరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ‘కొందరు ఆటగాళ్లకు జ్వరం వచ్చింది. కొందరు కోలుకున్నారు. ఇంకొందరు జ్వరంతో బాధపడుతున్నట్లు.’ టీమ్ మేనేజ్‌మెంట్ పీసీబీకి తెలియజేసిందట. ఆటగాళ్లకు మామూలు జ్వరమే వచ్చిందని ఆస్ట్రేలియాతో మ్యాచ్ కల్లా కోలుకుంటారని పలువురు చెబుతున్నారు.
అయితే, ప్రాక్టీస్‍పై మాత్రం దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఆటగాళ్లకు జ్వరం రావడం వల్ల ఓ ప్రాక్టీస్ సెషన్‍ను పాక్ రద్దు చేసింది. మెగా టోర్నీలో రెండు విజయాలు సాధించిన పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.