Pakistan vs West Indies ODI series
WI vs PAK: పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. 1991 తరువాత అంటే.. వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కోల్పోకుండా 34ఏళ్లుగా పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డును మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో బద్దలు కొట్టింది. వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ విధ్వంసకర బ్యాటింగ్‌తో వ్యక్తిగతంగా 120 పరుగులు చేయగా.. పాకిస్థాన్ మాత్రం 92 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆ జట్టు ఆటతీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షై హోప్ 120 నాటౌట్.. పాక్ 92 ఆలౌట్.. నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి మొదలైన మూడో వన్డేలో విండీస్ పాకిస్థాన్ జట్టును 202 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తద్వారా స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‍లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 94 బంతుల్లో 10ఫోర్లు, ఐదు సిక్సుల సహాయంతో అజేయంగా 120 పరుగులు చేశాడు. హోప్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా మొదటి 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 185 పరుగులు చేసిన విండీస్ జట్టు.. చివరి ఎనిమిది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 109 పరుగులు జోడించడం విశేషం. హోప్‌కు తోడు రోస్టన్ ఛేజ్ 29 బంతుల్లో 36, జస్టిన్ గ్రీవ్స్ 24 బంతుల్లో 43(నాటౌట్)పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ స్కోర్ 294కు చేరుకుంది.
RAW EMOTIONS BY WEST INDIES PLAYERS…!!! 🥺❤️
– The wait of 34 years is over, West Indies has defeated Pakistan in a ODI series. pic.twitter.com/LTukEY5hTi
— Johns. (@CricCrazyJohns) August 13, 2025
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు వెస్టిండీస్ బౌలింగ్ దాటికి చేతులెత్తేశారు. వెస్టిండీస్ బౌలర్ జేడన్ సీల్స్ 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాకిస్థాన్ 29.2 ఓవర్లలోనే 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు పాక్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 30పరుగులు చేసిన సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.
వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది పరుగుల పరంగా పాకిస్థాన్ జట్టుకు అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ సందర్భంలో 2015లో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన వన్డేలో 150 పరుగుల తేడాతో ఓడిపోయిన రికార్డును పాకిస్థాన్ బద్దలు కొట్టింది. ఇదిలాఉంటే.. 1991 తరువాత పాకిస్థాన్ పై వెస్టిండీస్ తన తొలి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ శతాబ్దంలో అంటే 2000 తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా పాకిస్థాన్‌పై వెస్టిండీస్ సాధించిన తొలి సిరీస్ విజయం కూడా ఇదే కావడం గమనార్హం. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ జట్టు 200 ప్లస్ పరుగులు సాధించి విజయం నమోదు చేయడం ఇది నాల్గోసారి.
మూడో వన్డేలో స్కోర్..
వెస్టిండీస్ : 294/6 ( హోప్ 120 నాటౌట్, అబ్రార్ అహ్మద్ 2-34)
పాకిస్థాన్ : 92 ఆలౌట్ (అఘర్ 30, జేడెన్ సీల్స్ 6-81)
వెస్టిండీస్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది.