Pat Cummins : ఆర్‌సీబీ పై హైదరాబాద్ ఓటమి.. కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
- Thota Vamshi Kumar
- Published On : April 26, 2024 / 10:58 AM IST
pic credit@ipl
Pat Cummins comments : ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో షాబాద్ అహ్మద్ (40) రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ తలా రెండేసి వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
RCB Playoffs Chances : సన్‌రైజర్స్ జట్టుపై విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు మెరుగయ్యాయా..
మ్యాచ్ అనంతరం.. ఓటమిపై కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. తమ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడడాన్ని సమర్థించాడు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన తమ విధానాన్ని మార్చుకోమని చెప్పాడు. మిగిలిన మ్యాచుల్లోనూ దూకుడుగానే ఆడతామని చెప్పాడు. ఈ రోజు తమకు అనుకూలంగా లేదన్నాడు. వికెట్లు త్వరగా కోల్పోవడంతోనే మ్యాచ్ చేజారిందన్నాడు. వాస్తవానికి మొదట బ్యాటింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదేమోనని చెప్పాడు.
ఏదీ ఏమైనప్పటికీ తమ జట్టు బ్యాటర్లు చాలా బాగా ఆడారని మెచ్చుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్ గెలవడం సాధ్యం కాదన్నాడు. ఈ ఓటమినే తలుచుకుంటూ కూర్చోవాల్సిన పనిలేదన్నాడు. తిరిగి బలంగా పుంజుకుంటామని అని కమిన్స్ తెలిపాడు.
హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మరోసారి వైరల్
