Phil Salt created history
Phil Salt created history : ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించారు. ఫిల్ సాల్ట్ (141 నాటౌట్, 60 బంతుల్లో 15×4, 8×6), జోస్ బట్లర్ (83; 30 బంతుల్లో 8×4, 7×6) చెలరేగడంతో ఆ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 146 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో భారీ మార్జిన్‌తో గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటర్ ఫిల్ సాల్ట్ సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
రెండు టెస్టు దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఒక జట్టు 300 పరుగుల మార్కును దాటడం ఇదే తొలిసారి. 2024లో హైదరాబాద్ లో బంగ్లాదేశ్ జట్టుపై 297/6తో భారత్ గతంలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఆ రికార్డును ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బద్దలు కొట్టింది.. తద్వారా సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 60 బంతుల్లోనే 141 (నాటౌట్) పరుగులు చేశాడు. 2023లో తరౌబాలో వెస్టిండీస్ పై సాల్ట్ 119 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రికార్డునుసైతం సాల్ట్ బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ENGLAND 304/2 IN A T20I MATCH 🫡
– This will go down in the History books in shorter format, Take a bow, Phil Salt. pic.twitter.com/ZeitKGPYE8
— Johns. (@CricCrazyJohns) September 12, 2025
ఫిల్ సాల్ట్ తన టీ20 కెరీర్‌లో నాలుగు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. గతంలో వెస్టిండీస్ జట్టుపై మూడు సెంచరీలు చేసిన సాల్ట్.. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై చేసిన సెంచరీతో తన నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సాల్ట్ అతితక్కువ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీ పూర్తి చేసి.. సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 2023లో 57 మ్యాచ్‌లలో తన నాలుగు సెంచరీలు పూర్తి చేయగా.. ప్రస్తుతం ఫిల్ సాల్ట్ 42 మ్యాచ్‌లలోనే నాలుగు సెంచరీలు పూర్తి చేశారు. ఈ జాబితాలో మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. 2018లో రోహిత్ 79 మ్యాచ్‌లలో తన నాల్గో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాతి స్థానంలో గ్లెన్ మాక్స్ వెల్ ఉన్నాడు.. అతను 2023లో తన 82వ మ్యాచ్‌లో నాల్గో సెంచరీ పూర్తి చేశాడు.
దక్షిణాఫ్రికా జట్టుపై టీ20ల్లో తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా ఫిల్ సాల్ట్ నిలిచాడు. తాజాగా సాల్ట్ 39 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. 2023లో జోనాథన్ చార్లెస్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. 2024లో టీమిండియాకు చెందిన తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అదే సంవత్సరంలో మరో భారత బ్యాటర్ సంజూ శాంసన్స్ 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
🚨 PHIL SALT – FASTEST HUNDRED IN ENGLAND T20I HISTORY. 🚨 pic.twitter.com/zhR3qPFUss
— Johns. (@CricCrazyJohns) September 12, 2025
టెస్టు హోదా కలిగిన జట్ల మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక స్కోరు..
♦ 304/2 ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, మాంచెస్టర్ 2025
♦ 297/6 ఇండియా vs బంగ్లాదేశ్, హైదరాబాద్ 2024
♦ 283/1 ఇండియా vs సౌతాఫ్రికా, జోబర్గ్ 2024
♦ 278/3 ఆఫ్ఘనిస్తాన్ vs ఐర్లాండ్, డెహ్రాడూన్ 2019
♦ 267/3 ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, టరోబా 2023
టీ20ల్లో అత్యధిక స్కోర్లు..
♦ 344/4 జింబాబ్వే vs గాంబియా, నైరోబి 2024
♦ 314/3 నేపాల్ vs మంగోలియా, హాంగ్జౌ 2023
♦ 304/2 ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, మాంచెస్టర్ 2025
♦ 297/6 ఇండియా vs బంగ్లాదేశ్, హైదరాబాద్ 2024
♦ 286/5 జింబాబ్వే vs సీషెల్స్, నైరోబి 2024