Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టులో మార్పులు.. సిరాజ్ ఔట్, ప్రసిద్ధ్ ఇన్..
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో పర్యటించనున్న భారత జట్టులో (Team India) స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- June 9, 2026 / 04:09 PM IST
Prasidh Krishna replaces Siraj in Team Indias T20I squads for Ireland and England
- ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టులో స్వల్ప మార్పులు
- మహ్మద్ సిరాజ్‌కు రెస్ట్
- అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు
Team India : భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలలో పర్యటించనుంది. ఐర్లాండ్ తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌లతో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లలో ఆడే జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఈ పర్యటనలకు సిద్ధమవుతున్న తరుణంలో భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది.
స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సిరాజ్‌కు విశ్రాంతిని ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల పనిభారం (వర్క్‌లోడ్) మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. బీసీసీఐ వైద్య బృందం అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ పరస్పరం చర్చించుకుని ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. సిరాజ్ తగినంత విశ్రాంతి తీసుకుని, పూర్తిగా రికవరీ అవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ మార్పు మినహా.. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
నవీకరించిన తరువాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత టీ20 జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
ఈ పర్యటన షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ రెండు టీ20లు ఆడుతుంది. అనంతరం జూలై 1 నుండి 11 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా ఇంగ్లాండ్‌తో భారత్ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
