Bizarre Run Out : క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్.. కీపర్ కాలు కింద బ్యాట్! థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!
శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య అనూహ్య రీతిలో (Bizarre Run Out) రనౌట్ అయ్యాడు
PriyanshArya Bizarre Run Out in IndiaA vs SriLankaA match
- కీపర్ కాలు కింద ఇరుక్కుపోయిన బ్యాట్
- ప్రియాన్ష్ ఆర్య వింత రనౌట్
- థర్డ్ అంపైర్ నిర్ణయం పై ఫ్యాన్స్ ఫైర్
Bizarre Run Out : క్రికెట్లో అప్పుడప్పుడు వింత రనౌట్లను చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ రనౌట్ ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏ, భారత్-ఏ జట్ల మధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం దంబుల్లా వేదికగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్సిమ్రాన్ సింగ్ (2) లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. 16 పరుగులకే ఓపెనర్లు ఔట్ కావడంతో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను రుతురాజ్ గైక్వాడ్, ప్రియాన్ష్ ఆర్యలు భుజాన వేసుకున్నారు.
కాగా.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ప్రియాన్ష్, రుతురాజ్ గైక్వాడ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఈ ఓవర్లోని ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్ లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. వేగంగా తొలి పరుగును పూర్తి చేసుకున్నాడు. రెండో పరుగు కోసం రుతురాజ్ పిలువగా తొలుత అంగీకరించిన ప్రియాన్ష్.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసి కాస్త సంకోచించి వెనక్కి తగ్గాడు.
Priyansh Arya and Ruturaj Gaikwad pic.twitter.com/XOwMPlg9Qp
— Dhruv (@dhruvbhavsar028) June 9, 2026
ఈ సమయంలో గందరగోళానికి లోనైన బ్యాటర్లు ఇద్దరూ పిచ్ పై ఒకే ఎండ్ వైపు(స్ట్రైకింగ్)కు పరిగెత్తారు. కాగా.. ప్రియాన్ష్ కంటే ముందుగానే రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చేశాడు. మరోవైపు ప్రియాన్ష్ ఆర్య క్రీజును చేరుకునే క్రమంలో బ్యాట్‌ను నేలను ఆనిపించి ముందుకు వెలుతుండగా.. లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా కాలు కింద అతడి బ్యాట్ ఇరుక్కుపోయింది.
దీంతో అతడు సమయానికి క్రీజులోకి రాలేకపోయాడు. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న కీపర్ మరో ఎండ్‌లో వికెట్లను పడగొట్టాడు. అయితే..థర్డ్ అంపైర్ ఈ విషయాన్ని (కీపర్ కాలు కింద బ్యాట్ ఇరుక్కుపోవడం) గమనించకుండానే ఔట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కీపర్ కాలు అడ్డుపడకపోయి ఉంటే.. రుతురాజ్ కంటే ముందే ప్రియాంశ్ క్రీజులోకి చేరి ఉండేవాడని, అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ (101 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. తిలక్ వర్మ (60 97 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
