BCCI : బీసీసీఐ కీలక నిర్ణయాలు! వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రమోషన్..! అజిత్ అగార్కర్‌కు..
తెలుగు తేజం, టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుత అధిపతి అయిన వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్లో మరింత పెద్ద బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది.
VVS Laxman likely to become BCCI Director of Cricket
BCCI : తెలుగు తేజం, టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుత అధిపతి అయిన వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్లో మరింత పెద్ద బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. భారత క్రికెట్ డైరెక్టర్‌గా ఆయన నియమితులు కానున్నారు. సెప్టెంబర్‌లో కీలక పదవుల పునర్వ్యవస్థీకరణకు బీసీసీఐ సిద్ధమవుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుండటం, జాతీయ జట్టు కోచింగ్ వ్యవస్థ కూడా పరిశీలనలో ఉండటంతో, బోర్డు కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. క్రమంలోనే లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని అప్పగించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించవచ్చునని తెలుస్తోంది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో లక్ష్మణ్ ప్రస్తుతం ఆటగాళ్ల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిపాదిత చర్య ఆయన బాధ్యతలను గణనీయంగా పెంచనుంది. ఈ నియామకంపై గానీ, ప్రతిపాదిత పదవి స్వరూపంపై గానీ బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్రికెట్ డైరెక్టర్ అంటే ఏమిటి?
ఖచ్చితమైన బాధ్యతలు బీసీసీఐ తుది స్వరూపంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. భారత క్రికెట్ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరించడమే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా లక్ష్మణ్ పని.
ఈ పదవిలో సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, భారతదేశ క్రీడాకారుల ప్రస్థానంలోని వివిధ దశల మధ్య సమన్వయ కర్తగా ఉంటాడు. అలాగే ప్రతిభను గుర్తించడం, క్రీడాకారుల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రణాళికలు రచించడంలో భాగస్వామ్యం వంటి బాధ్యతలు ఉంటాయి. CoEలో లక్ష్మణ్ ఇప్పటికే చేస్తున్న పనికి ఇది ఒక సహజమైన కొనసాగింపు అవుతుంది,
2024లో రాహుల్ ద్రవిడ్ తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టడానికి లక్ష్మణ్ ఇష్టపడలేదు సరికదా..బీసీసీఐ పునరుద్ధరించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హెడ్ బాధ్యతలను చేపట్టేందుకు మొగ్గు చూపాడు. ఆటగాళ్లు తరుచుగా గాయపడుతుండడంతో సీఓఈ పనితీరుపై ఇటీవల విమర్శలు రాగా.. లక్ష్మణ్ ధీటుగా తిప్పి కొట్టారు.
