Goa Liberation : 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. గోవాకు మాత్రం 14ఏళ్లు ఆలస్యం.. 36గంటల సైనిక ఆపరేషన్ తరువాత.. అసలేం జరిగింది?
Goa Liberation Day : 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అప్పటికి గోవాలో పోర్చుగీసు పాలన కొనసాగుతోంది.
Goa Liberation Day
Goa Liberation Day : బ్రిటీష్ పాలన నుంచి భారత దేశానికి 1947లో విముక్తి లభించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, మన దేశంలో కొన్ని సంస్థానాలకు మాత్రం ఆ రోజు స్వాతంత్ర్య సంబరాలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. అలాంటి ప్రాంతాల్లో గోవా ఒకటి. అయితే, గోవా అప్పటికి బ్రిటిష్ పాలనలో లేదు. ఆ సమయంలో గోవా పోర్చుగీసు పాలనలో కొనసాగింది. చివరకు 1961లో భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా గోవా విముక్తి పొందింది. ఈ సైనిక చర్య 36 గంటలకు పైగా కొనసాగి, 19 డిసెంబర్ 1961న పోర్చుగీసు దళాల లొంగుబాటుతో ముగిసింది.
1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అప్పటికి గోవాలో పోర్చుగీసు పాలన కొనసాగుతోంది. పోర్చుగీసులు 1510 నుంచి గోవాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత గోవాను భారత్లో విలీనం చేయడానికి దౌత్యపరంగా ప్రయత్నాలు జరిగాయి. కానీ, పోర్చుగల్ గోవాపై తన నియంత్రణను వదులుకోవడానికి అంగీకరించలేదు. దీంతో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సుదీర్ఘకాలం గోవా వారి పాలనలోనే కొనసాగింది.
1961 డిసెంబర్లో పరిస్థితి కీలక మలుపు తిరిగింది. భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైనిక చర్య ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ డిసెంబర్ 17 నుంచి 19 వరకు సాగింది. 36 గంటలకుపైగా జరిగిన సైనిక చర్య అనంతరం పోర్చుగీసు గవర్నర్ మాన్యుయెల్ ఆంటోనియో వస్సాలో ఇ సిల్వా లొంగిపోయారు. దీంతో 1961 డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో భాగమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజుతో భారత భూభాగంలో కొనసాగుతున్న పోర్చుగీసు పాలనకు ముగింపు పలికింది.
పోర్చుగీసు నుంచి భారత దేశంలో భాగమైన తరువాత గోవాతోపాటు దమన్, దీవ్ ప్రాంతాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1967లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గోవా మహారాష్ట్రలో విలీనం కావాలా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగాలా అనే అంశంపై ప్రజలు ఓటు వేశారు. మెజారిటీ ప్రజలు కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగాలని నిర్ణయించారు. అయితే, 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా లభించింది. దీంతో గోవా భారతదేశంలోని 25వ రాష్ట్రంగా అవతరించింది.
