Harry Brook : నిషేదం ముగిసిన తరువాత ఐపీఎల్‌లోకి మళ్లీ వస్తా.. హ్యారీ బ్రూక్
ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) భవిష్యత్తులో మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.
Harry Brook announces IPL comeback after ban
Harry Brook : ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ భవిష్యత్తులో మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. వరుసగా రెండు సీజన్ల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం రెండేళ్ల ఐపీఎల్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న బ్రూక్.. భవిష్యత్తులో ఐపీఎల్‌కు తిరిగి రావాలనే ఆలోచనను మాత్రం వదులుకోలేదని తెలిపాడు. అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఇంగ్లాండ్ క్రికెట్‌పైనే ఉందని చెప్పాడు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్ ఆడటంపైనే నా పూర్తి దృష్టి ఉంది. ప్రస్తుతానికి అదే నా ఏకైక ప్రాధాన్యత అని బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. అదో గొప్ప టోర్నమెంట్ అని, అక్కడ ఆడటం గొప్ప అనుభవం అని అన్నాడు. ఇండియాకు వెళ్లి ఆడిన తర్వాత మరింత మెరుగైన ఆటగాడిగా తిరిగి వస్తారని, ఐపీఎల్లో భాగం కావడం చాలా మంచిదని, భవిష్యత్తులో దీనిపై తప్పకుండా ఆలోచిస్తానన్నాడు.
2028లో ఐపీఎల్‌లోకి రీఎంట్రీ
వరుసగా రెండు సీజన్లలో టోర్నీ నుంచి వైదొలిగిన కారణంగా బ్రూక్‌పై ఐపీఎల్ రెండేళ్ల నిషేధం పడింది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అందుబాటులో లేకపోయిన బ్రూక్.. తన అమ్మమ్మ మరణం కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మరోసారి టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. గాయం లేదా వైద్య కారణాన్ని ఆటగాడి దేశ క్రికెట్ బోర్డు ధృవీకరించిన సందర్భంలో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో బ్రూక్ 2028 ఐపీఎల్ వేలంలో తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.
55 బంతుల్లోనే శతకం..
బ్రూక్ తొలిసారి 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడి 190 పరుగులు చేశాడు. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో చేసిన అజేయ సెంచరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం 55 బంతుల్లోనే బ్రూక్ శతకం సాధించాడు.
కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రూక్.. కెప్టెన్సీ ఎంతటి మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తుందో వెల్లడించాడు. “కెప్టెన్సీ చాలా కష్టం. అది మిమ్మల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. భారత్‌తో మేము ఆడిన తీరు అద్భుతంగా ఉంది. కానీ మ్యాచ్ ముగిసేసరికి నేను చాలా అలసిపోయాను. మళ్లీ ది హండ్రెడ్‌లో బ్యాటర్‌గా మాత్రమే ఆడేందుకు రావడం ఆనందంగా అనిపించింది” అని బ్రూక్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ లీడ్స్‌తో కొత్త ప్రయాణం..
ప్రస్తుతం బ్రూక్ ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఆడుతున్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం మారడంతో జట్టులో కొత్త వాతావరణం ఏర్పడిందని అతడు చెప్పాడు.
“కొత్త యాజమాన్యం రావడంతో కొన్ని మార్పులు సహజంగానే ఉంటాయి. మైదానం చుట్టూ ఇప్పుడు మరింత ఆరెంజ్ కనిపిస్తోంది. అయితే ప్రతి ఫ్రాంచైజీలోలాగే ఇక్కడ కూడా అందరినీ త్వరగా తెలుసుకోవడం, మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. చివరికి మనమంతా కొన్ని మ్యాచ్‌లు గెలవడానికే ఇక్కడికి వచ్చాం” అని బ్రూక్ చెప్పాడు.
2025లో అద్భుతంగా రాణించిన బ్రూక్‌ను లీడ్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. గత సీజన్లో సెమీఫైనల్ వరకు వెళ్లిన జట్టు.. ఈసారి కొత్త యాజమాన్యంతో మరింత ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
