Pro Kabaddi League season 10
ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని అక్షర్ రివర్ క్రూజ్‌లో ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ ను లాంఛనంగా ప్రారంభించారు. మాషల్ స్పోర్ట్స్, ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ఈ ప్రత్యేక సీజన్‌ను తొమ్మిదో సీజన్‌లో విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్, పదో సీజన్ తొలి మ్యాచ్‌లో పోటీ పడే కెప్టెన్లు పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్), ఫజెల్ అత్రాచలి (గుజరాత్ జెయింట్స్)తో కలిసి ప్రారంభించారు.
అనంతరం అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. 12 నగరాల కారవాన్ మోడల్‌కు తిరిగి వెళ్లడం పదో సీజన్ కు చారిత్రాత్మక సందర్భం కానుంది. 2019 తర్వాత లీగ్‌ను అభిమానులు తమ సొంత నగరాల్లో చూడలేకపోయారు. అయితే.. ఈ సీజన్‌ను 12 నగరాల్లో నిర్వహించడం ద్వారా ఆయా ఫ్రాంచైజీలు తమ సొంత ప్రాంతంలోని ప్రజలు, అభిమానులతో బలమైన అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి దోహదం అవుతుందని చెప్పారు.
12 జట్లు 12 నగరాలు.. ప్రైజ్‌మనీ ఎంతంటే..?
డిసెంబర్ 2 శనివారం నుంచి మ్యాచులు జరగనున్నాయి. 12 జట్ల మధ్య దాదాపు రెండున్నర నెలల పాటు ఈ టోర్నీ జరగనుంది. మొదటి మ్యాచులో తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్‌లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని ఈకేఏ ఏరీనా స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. కాగా.. 12 నగరాల్లో మ్యాచులు జరగనున్నాయి. ఐపీఎల్‌లో మాదిరిగా జట్లు వివిధ నగరాలు తిరుగుతూ మ్యాచులు ఆడవు. ఒక నగరంలో ఒక్కో లెగ్ ముగిసిన తరువాత అన్ని టీమ్‌లు మరో నగరానికి వెలుతాయి.
మొదటగా డిసెంబర్ 2 నుంచి 7 వరకు అహ్మదాబాద్‌లో మ్యాచులు జరుగుతాయి. ఆ తరువాత బెంగళూరు (డిసెంబర్ 8-13), పూణే (డిసెంబర్ 15-20), చెన్నై (డిసెంబర్ 22-27), నోయిడా (డిసెంబర్29 – జనవరి 3), ముంబై (జనవరి 5-10), జైపూర్ (జనవరి 12-17), హైదరాబాద్ (జనవరి 19-24 జనవరి), పాట్నా (జనవరి 26- 31), ఢిల్లీ (ఫిబ్రవరి 2-7), కోల్‌కతా (ఫిబ్రవరి 9-14), పంచకుల (ఫిబ్రవరి 16-21)లలో మ్యాచులు జరగనున్నాయి.
ప్రైజ్‌మనీ ఎంతంటే..?
పీకేఎల్ పదో సీజన్ ప్రైజ్ మనీ రూ.8 కోట్లు. విజేతకు రూ.3 కోట్లు, రన్నరప్ రూ1.8 కోట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఒక్కొ జట్టుకు రూ.90 లక్షలు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన ఒక్కో జట్టుకు రూ.45 లక్షలు చొప్పున అందించనున్నారు. అంతేకాకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు, రిఫరీలకు నగదు పురస్కారాన్ని అందించనున్నారు. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌కు రూ.15 లక్షలు, బెస్ట్ రైడర్ కు రూ.10 లక్షలు, ఏస్ డిఫెండర్‌కు రూ.10 లక్షలు, ఉత్తమ డెబ్యుటెంట్ కు రూ.8 లక్షలు, బెస్ట్ రిఫరీ మేల్ అండ్ ఫిమేల్ ఒక్కొక్కరికి రూ.3.5 లక్షల చొప్పున దక్కనుంది.