Virat Kohli: వామ్మో.. రూ.110 కోట్ల డీల్‌కి విరాట్‌ కోహ్లీ స్వస్తి.. పెద్ద ప్లానే వేశాడుగా..

అభిషేక్ గంగూలీ గతంలో ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆయనే కంపెనీ పెట్టి..

Virat Kohli

టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ నుంచి అన్ని ప్రచార, ప్రకటనల పోస్ట్‌లను తొలగించాడు. ఇప్పుడు అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫ్యామిలీ, ప్రాక్టీస్‌ సెషన్లు, వ్యక్తిగత ఫొటోలు వంటివే కనపడుతున్నాయి. కంపెనీల ప్రచార కంటెంట్ పూర్తిగా కనిపించడంలేదు. అతడి సొంత కంపెనీ One8కు సంబంధించిన కంటెంట్‌ మాత్రం కనపడుతోంది.

విరాట్ కోహ్లీకి ప్యూమా బ్రాండ్‌తో ఉన్న ఎనిమిదేళ్ల కాంట్రాక్ట్‌ త్వరలోనే ముగియనుంది. రూ.110 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని కోహ్లీ 2017లో చేసుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ మరో కంపెనీలో ఇన్వెస్టర్‌గా చేరాలనుకుంటున్నాడు. 2023లో అభిషేక్ గంగూలీ స్థాపించిన స్పోర్ట్స్‌వేర్‌ కంపెనీ ఎగిలిటాస్ స్పోర్ట్స్‌లో చేరాలని భావిస్తున్నాడు.

అభిషేక్ గంగూలీ గతంలో ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. కోహ్లీ ఎజిలిటాస్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే కాకుండా ఆ సంస్థలో వాటాదారుడిగానూ ఉంటాడు. ఎజిలిటాస్ స్పోర్ట్స్ కంపెనీ గత ఏడాది భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో ఇటాలియన్ స్పోర్ట్స్ బ్రాండ్ లోట్టో ఉత్పత్తుల అమ్మకాల కోసం ఒప్పందం కుదుర్చుకుని, ఇందుకు సంబంధించి లాంగ్ టెర్మ్ లైసెన్స్‌ కూడా పొందింది.

తన సొంత కంపెనీ వన్8ను అభివృద్ధి చేయడంతో పాటు అజిలిటాస్ మరిన్ని స్టోర్‌లు తెరిచేలా చేసేలా కోహ్లీ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ప్యూమాతో ఒప్పందానికి ఇక స్వస్తి చెబుతున్నాడు. అజిలిటాస్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కోహ్లీ భాగస్వామ్యం బాగా ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఫుట్‌వేర్, స్పోర్ట్స్‌వేర్‌లో One8ని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడానికి కూడా కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని తెలిపాయి. One8 న్యూ బ్రాండ్ ఐడెంటిటీ, రీలాంచ్‌ ఉంటుందని చెప్పాయి.

కోహ్లీతో చేసుకున్న రూ.110 కోట్ల విలువైన ఒప్పందం ముగుస్తున్న వేళ ప్యూమా అతడిని మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నించిందని, కానీ అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్‌లో సొంతంగా గ్లోబల్ కంపెనీని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో కోహ్లీ ఉన్నాడని తెలిపాయి.