తొలి క్వాలిఫయర్ మ్యాచులో ఓడి.. రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్లడంపై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర కామెంట్స్‌

క్వాలిఫయర్ 2 మ్యాచులో వచ్చిన ఫలితమే ఇందుకు ఉదాహరణ అని శ్రేయస్ చెప్పాడు.

Courtesy BCCI

పంజాబ్ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఐపీఎల్‌ మెగా వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్‌గా పెట్టుకుంది. తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్లే శ్రేయస్‌ రాణిస్తున్నాడు. పంజాబ్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో గెలిచిన పంజాబ్‌ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ తమ విజయ రహస్యాన్ని చెప్పాడు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నిశ్శబ్దంగా ఉండటం వెనుక పెద్ద కారణం ఏమీ లేదని, ఇటువంటి కీలక మ్యాచులంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. తన తోటి ఆటగాళ్లను తాను చెప్పేది ఒకటేనని ఇటువంటి సమయంలో నిశ్శబ్దంగానే ఆడితే మంచి రిజల్ట్స్‌ వస్తుందని అన్నాడు.

Also Read: ఇందుకే ముంబై ఇండియన్స్‌ ఓడిపోయింది: కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్‌

క్వాలిఫయర్ 2 మ్యాచులో వచ్చిన ఫలితమే ఇందుకు ఉదాహరణ అని శ్రేయస్ చెప్పాడు. 200 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ ఉన్న సమయంలో జట్టులో ప్రతి ఆటగాడు అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు. మొదటి బాల్‌ నుంచే గెలుపుకోసం ప్రయత్నించాలని అన్నాడు. ఈ మ్యాచులో తాము కూడా అదే చేసినట్లు తెలిపాడు.

మొదట తాను క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు కొంత టైమ్ తీసుకున్నానని శ్రేయస్ అన్నాడు. అప్పుడు క్రీజులో ఇతర బ్యాటర్లు రన్స్‌ రాబట్టారని తెలిపాడు. తాము ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచులో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురయ్యామని, అయినప్పటికీ, ఆ విషయాన్ని అక్కడితోనే మరిచిపోయామని అన్నాడు.