PVL 2024 Kochi Blue Spikers beats Hyderabad Black Hawks
PVL 2024: రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్‌లో తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించిన కొచ్చి బ్లూ స్పైకర్స్ సీజన్‌ను ముగించింది. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఏడో ఓటమితో ఈ సీజన్ నుంచి వైదొలిగింది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 15-12, 15-12, 15-11తో హైదరాబాద్ ను ఓడించింది. ఆ జట్టు ఆటగాడు జిబిన్ సెబాస్టియన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
సూపర్5 రేసు నుంచి వైదొలిగి ఆఖరి మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నించిన ఇరు జట్లలో హైదరాబాద్‌పై కొచ్చి బ్లూ స్పైకర్స్ దే పైచేయి అయింది. అమన్ కుమార్ దూకుడైన సర్వీస్‌లతో కొచ్చి మంచి ఆరంభం అందించాడు. అదే సమయంలో అనవసర తప్పిదాలు బ్లాక్ హాక్స్‌ను దెబ్బతీశాయి. కొచ్చి ఆటగాళ్లు జిబిన్, ఎరిన్ లైన్స్ నుంచి దాడులను నియంత్రించగా, వరుస స్పైక్‌లతో సత్తా చాటిన అమన్ జట్టుకు సహాయం చేశాడు. మరోవైపు సర్వీస్ లైన్ నుంచి అషామత్ ఉల్లా మెరుగ్గా ఆడుతూ బ్లాక్ హాక్స్ ను తిరిగి రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, హైదరాబాద్ దాడులను అథోస్ బ్లాక్ చేయడంతో తొలి సెట్ గెలిచిన కొచ్చి ఆధిక్యం సాధించింది.
రెండో సెట్‌లో ఓం వసంత్ లాడ్ సర్వీస్ లైన్ నుంచి పదునైన షాట్లు కొట్టడంతో కొచ్చి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ దశలో స్టెఫాన్ కోవాసెవిక్ బ్లాక్ హాక్స్ డిఫెన్స్‌ను బలోపేతం చేశాడు. కానీ అథోస్ నేతృత్వంలోని ముగ్గురు ఆటగాళ్లతో కూడిన కొచ్చి బ్లాకర్లు హైదరాబాద్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. సాహిల్ కుమార్ హైదరాబాద్‌కు సూపర్ పాయింట్ అందించినప్పటికీ కొచ్చి ఆటను తన నియంత్రణలోనే ఉంచుకుంది. రెండో సెట్ కూడా నెగ్గి సీజన్‌లో తొలి విజయం దిశగా ముందంజ వేసింది.
Also Read: ఏమయ్యా బషీర్.. క్లీన్‌బౌల్డ్‌కు రివ్య్వూనా? చూడు అందరూ ఎలా నవ్వుతున్నారో.. వీడియో
మూడో సెట్‌లోనూ జిబిన్ హైదరాబాద్ బ్లాకర్లను బలమైన స్పైక్‌లతో పరీక్షించాడు. అదే సమయంలో బ్లాక్ హాక్స్ అనవసర తప్పిదాలతో చేజేతులా పాయింట్లు కోల్పోయింది. ఇంకోవైపు ఓం వసంత్ అద్భుతమైన సర్వీస్‌లతో హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. అమన్ కుమార్ పైప్ ఎటాక్‌తో గేమ్‌ను ముగించగా, కొచ్చి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకైక విజయంతో సీజన్‌ను ముగించింది.