Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి జోష్‌లో ఉంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటింలో గెలిచింది. సోమవారం వాంఖడే వేదికగా ముంబై పై 12 పరుగుల తేడాతో గెలవడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకువచ్చింది.
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (67; 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. జితేశ్ శర్మ (40 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. విఘ్నేశ్ పుతూర్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (42; 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు దంచికొట్టారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై విజయానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
ఇక ముంబై పై అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ముంబై పై విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది అద్భుమైన మ్యాచ్ అని చెప్పాడు. బౌలర్లు ధైర్యం చూపించిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. నిజం చెప్పాలంటే.. ఈ అవార్డు బౌలింగ్ యూనిట్‌కే దక్కుతుందన్నాడు.
ఎందుకంటే ఈ మైదానంలో బ్యాటింగ్ యూనిట్‌ను ఆపడం అంత సులభం కాదన్నాడు. కాబట్టి ఆ క్రెడిట్ వారికే(బౌలర్లకే) దక్కుతుందని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేసిన విధానం చాలా బాగుంది. కృనాల్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. చివరి ఓవర్‌లో అతను బౌలింగ్ చేసిన విధానం, అతను చూపించిన ధైర్యం అద్భుతంగా ఉంది. ఆ సమయంలో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. అందుకనే కృనాల్‌కు ఆఖరి ఓవర్‌ను ఇచ్చాను అని రజత్ చెప్పాడు.
ఇక పిచ్ బాగుందని, బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తోందన్నాడు. మణికట్టు స్పిన్నర్ సుయాష్ శర్మ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అని రజత్ అన్నాడు.