Rashid Khan comments after Afghanistan lost to Bangladesh in Asia Cup 2025
BAN vs AFG : ఆసియాకప్ 2025లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అబుదాబి వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తంజిద్ హసన్ (52; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అఫ్గాన్ బ్యాటర్లలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు చెరో రెండు వికెట్లు తీశాడు.
Sunil Gavaskar : గెలిచిన కెప్టెన్ చెప్పేదే వింటారు.. అఫ్రిదికి గవాస్కర్ కౌంటర్
155 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30), రషీద్ ఖాన్ (20)లు రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు తీశాడు. నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ ఓటమితో అఫ్గాన్ సూపర్ 4 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. లీగ్ దశలో లంకతో అఫ్గాన్ చివరి మ్యాచ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే అఫ్గాన్ సూపర్4 రేసులో ఉంటుంది.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. తమ స్థాయికి తగ్గట్లుగా ఆడలేదన్నాడు. అందుకే ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు పోరాడినప్పటికి అనుకూల ఫలితాన్ని రాబట్టలేకపోయామన్నాడు. టీ20 క్రికెట్‌లో ఆఖరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. దూకుడైన క్రికెట్ ఆడుతామనే పేరు తమకి ఉందని, అయితే.. ఈ మ్యాచ్‌లో తమ స్థాయికి తగినట్లుగా రాణించలేకపోయామన్నాడు.
బంగ్లాదేశ్‌ను 160లోపే కట్టడి చేశాము. అయితే.. బ్యాటింగ్‌లో కాస్త ఒత్తిడికి లోనయ్యాము. బాధ్యతారహిత షాట్లు ఆడి అందుకు తగిలిన మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నాడు. ఆసియాకప్‌లో ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యమైనదని, తదుపరి లంకతో ఆడనున్నామని, ఆ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్ధం అవుతామని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హాంకాంగ్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అటు లంక జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. అగ్రస్థానంలో ఉంది. అఫ్గాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మూడో స్థానంలో ఉంది.
ఈ క్రమంలో అఫ్గాన్, లంక జట్టు మధ్య మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో లంక గెలిస్తే అప్పుడు.. లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్ 4కి చేరుకుంటాయి. అలాకాకుండా అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తే.. అప్పుడు మూడు జట్ల పాయింట్లు సమం అవుతాయి. మెరుగైన రన్‌రేటు ఉన్న రెండు జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి.