Rashid Khan Ruled Out Of T20I Series Against India Confirms Skipper Ibrahim Zadran
Rashid Khan Ruled Out: టీమిండియాతో T20 సిరీస్ కు ముందు అఫ్గానిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు దూరమయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో వెన్నుముఖకు శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్ ఖాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. భారత్‌తో సిరీస్‌కు రషీద్ ఖాన్ దూరమయ్యాడని, అతడు జట్టులో లేనప్పటికీ విజయం కోసం సమిష్టిగా పోరాడతామని చెప్పాడు.
మొహాలిలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపు (గురువారం) తొలి T20 మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్నారు. అమెరికా వేదికగా జూన్‌లో జరిగే T20 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ గెలిచి ప్రపంచ కప్‌కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. రషీద్ ఖాన్ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
సౌతాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా స్వదేశంలోనూ సత్తా చాటి T20 టిరీస్ గెలవాలని ఉవ్విళూరుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులోకి రావడంతో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. యువ ఆటగాళ్లు యశస్వి జైశాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, రింకు సింగ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, జితేశ్ శర్మ, ఆవేశ్ ఖాన్ తమ ప్రతిభను ప్రదర్శించి T20 ప్రపంచ కప్‌కు ఎంపిక కావాలని భావిస్తున్నారు.
Also Read: ధోనీ మొదలెట్టాడు.. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన తలైవా.. వీడియో వైరల్
స్వదేశంలో పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా ఉన్నప్పటికీ అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేమని క్రీడా నిపుణులు అంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తనదైన రోజున ఆ జట్టు.. పెద్ద టీమ్‌లకు షాక్ ఇస్తుందని వివరిస్తున్నారు. రషీద్ లేనప్పటికీ ముజీబ్ జద్రాన్, నవీన్-ఉల్ హక్, ఫజాలక్ ఫరూఖీలు రావడంతో జట్టు పూర్తి బలంతో ఉంది. టీమిండియాను స్వదేశంలో ఓడించాలన్న పట్టుదలతో అఫ్గానిస్థాన్ బరిలోకి దిగుతోంది.