తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించిన ఆర్సీబీ… అంతేకాదు..

ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.

బెంగళూరులో నిన్న జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ ఫ్యామిలీకి తీవ్ర వేదన కలిగించిందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చెప్పింది. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

అలాగే, ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కేర్స్ పేరుతో ఫండ్‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. తమ ఫ్యాన్స్‌ ఎప్పటికీ తమ హృదయంలో ఉంటారని, తాము చేసే ప్రతి పనిలోనూ ఇది ప్రతిబింబిస్తుందని చెప్పింది.

కర్ణాటక హైకోర్టులో విచారణ
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనపై అడ్వకేట్ జనరల్ నివేదిక సమర్పించారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

జూన్ 4న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు 2025 ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటకు సంబంధించిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం కూడా రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.