నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన రిషబ్ పంత్.. ఎవరికంటే..?

పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తానని టీమిండియా వికెట్ కీపర్ రిషల్ పంత్ ప్రకటించాడు. ఎవరికో తెలుసా?

Rishabh Pant To Give Cash Reward If Neeraj Chopra Wins Javelin Gold

Rishabh Pant Cash Prize: పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ పొగట్ అనూహ్యంగా నిష్క్రమించడంతో ఇప్పుడు భారతీయుల ఆశలన్నీ ఇప్పుడు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. అతడు బంగారు పతకం సాధిస్తాడని ఇండియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగినట్టుగానే క్వాలిఫైయర్‌ రౌండ్ లో సత్తా చాటి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ రోజు రాత్రి జరగనున్న ఫైనల్లో నీరజ్ చోప్రా ముందంజలో నిలిచి వరుసగా రెండో స్వర్ణం గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. నీరజ్ చోప్రా విజయాన్ని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

టీమిండియా వికెట్ కీపర్ రిషల్ పంత్ ఒక అడుగు ముందుకేసి బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అభిమానుల్లో ఒకరికి లక్ష రూపాయలు నజారానా ఇస్తానని ఎక్స్ వేదికగా ప్రామిస్ చేశాడు. అయితే ఇందుకో కండిషన్ పెట్లాడు. నీరజ్ చోప్రా కోసం చేసిన ట్వీట్లలో ఎక్కువ లైకులు, కామెంట్స్ వచ్చిన లక్కీ విన్నర్ కు నగదు బహుమతి ఇస్తానని వెల్లడించాడు.

Also Read: రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్.. భావోద్వేగభరిత కామెంట్స్

“నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే.. ఎవరి ట్వీట్‌కు అయితే ఎక్కువ లైకులు, కామెంట్స్ వస్తాయో వారికి 100089 రూపాయలు ఇస్తా. అలాగే తమ ట్వీట్లతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించి టాప్ 10లో నిలిచిన పది మందికి విమాన టిక్కెట్లు కూడా ఇస్తాను. నా సోదరుడి కోసం ఇండియా నుంచి మిగతా ప్రపంచం నుంచి మద్దతు కావాల”ని రిషబ్ పంత్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.

 

పంత్ ఆఫర్‌పై అతడి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే తాము కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తామంటూ వారు ముందుకు వచ్చారు. చదువు మధ్యలో ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు తన వంతుగా రూ. 11007 ఇస్తానని కేవల్ కపూర్ అనే నెటిజన్ ప్రకటించారు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. నా రిప్లైకి కామెంట్ పెట్టే ఇద్దరు లక్కీ విన్నర్లకు రూ. 50 వేలు ఇస్తామని స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరడీ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. మరికొంత మంది కూడా ఇదేవిధంగా స్సందించారు.