Vijay Hazare Trophy
Virat Kohli Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున ఆడగా.. రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున రెండు మ్యాచ్ లు ఆడాడు. అయితే వారు టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 24న జరిగిన తమ తొలి మ్యాచ్‌లలో ఇద్దరూ సెంచరీలు చేశారు. అయితే, రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 77 పరుగులతో రాణించగా.. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరూ ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, తాజాగా వీరు మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విజయ్ హజారే ట్రోఫీలో ఆడడంతో ఈ టోర్నీకి మరింత క్రేజ్ పెరిగింది. కోహ్లీ, రోహిత్ ఆడే మ్యాచ్‌లను నేరుగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ ప్రియులు స్టేడియంకు వచ్చారు. అయితే, వారిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. అయితే, తాజా నివేదిక ప్రకారం.. జనవరి 18వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో విజయ్ హజారే ట్రోపీలో రోహిత్, కోహ్లీలు మళ్లీ ఆడతారని తెలుస్తోంది.
జనవరి 6వ తేదీన రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లీ మరోసారి ఆడతారని తెలుస్తోంది. జనవరి 6వ తేదీన విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆడతాడా లేదా అనేది భారత జట్టు శిక్షణా శిబిరంపై ఆధారపడి ఉంటుందని సమాచారం.
మూడు మ్యాచ్‌ల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం జాతీయ జట్టు ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో పాల్గొనడం వీరి అంతర్జాతీయ కెరీర్‌కు ముఖ్యం. కాబట్టి జనవరి 6వ తేదీన విరాట్ ఆడే మ్యాచ్‌పై డెసిషన్ కూడా బీసీసీఐ, టీమిండియా కోచ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడారు. అయితే, రోహిత్ మరో మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రెండు మ్యాచ్‌ల తరువాత రోహిత్ ముంబై జట్టును వీడాడు. దీంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) త్వరలో అతని స్థానంలో మరో ప్లేయర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ డిసెంబర్ 29వ తేదీన ఛత్తీస్‌గఢ్‌తో ఆడనుంది.