Rohit Sharma
Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో ఉన్నాడంటే సిక్సుల మోత మోగడం ఖాయం. ప్రాక్టీస్ సెషన్‌లో అయినా.. మ్యాచ్ సమయంలో అయినా రోహిత్ సిక్సుల మోత మోగిస్తూనే ఉంటాడు. అయితే, తాజాగా.. అతని సూపర్ బ్యాటింగ్‌తో తన సొంత లగ్జరీ కారునే పగల గొట్టేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అసలేం జరిగిందనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు.
38ఏళ్ల రోహిత్ శర్మ గత సంవత్సరం టీ20 వరల్డ్ కప్ విజయం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీతో భారత జట్టుకు వరుసగా రెండో ఐసీసీ టైటిల్ అందించిన టీమిండియా సారథిగా నిలిచాడు. ఆ తరువాత టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం టీమిండియా జట్టులో రోహిత్ శర్మను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ, రోహిత్ శర్మను కెప్టెన్సీ స్థానం నుంచి తప్పించి.. ఆ స్థానాన్ని శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. అక్టోబర్ 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రాణించేందుకు రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని ఐకానిక్ శివాజీ పార్కులో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ నాయక్‌తో కలిసి పాల్గొన్నాడు. అక్కడ దాదాపు రెండుమూడు గంటలపాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో రోహిత్ ఆటను తిలకించేందుకు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రోహిత్.. రోహిత్ అంటూ కేకలు వేస్తూ సందడి చేశారు. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సుకు అతని ఖరీదైన కారుల్లో ఒకటైన లంబోర్ఘిని కారు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రోహిత్ శర్మ భారీ సిక్సు కొట్టడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే, ఆ బంతి నేరుగా వెళ్లి రోహిత్ శర్మ లంబోర్ఘిని కారును తాకిందని కొందరు అభిమానులు అనడం వీడియోలో వినిపించింది. ఒక అభిమాని ‘ఖుద్ కి గాడి కో ఫోడ్ దియా’ అని చెప్పడం వీడియోలో వినొచ్చు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. హిట్‌మ్యాన్ సిక్స్ పవర్ లెవెల్ గురించి జోకులు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ROHIT SHARMA IN THE PRACTICE SESSION.
– One of the shots broke his own Lamborghini. 🤣
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2025
రోహిత్ శర్మకు కార్లపై మక్కువ ఎక్కువే. అతని వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో లంబోర్ఘిని ఉరుస్ కారు కూడా ఉంది. ఇదిలాఉంటే.. రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సు కారణంగా నిజంగానే అతని కారు డ్యామేజ్ అయిదా..? అనే విషయంపై క్లారిటీ లేదు.
రోహిత్ శర్మ ఇటీవల CEAT క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టూర్ గురించి ప్రస్తావిస్తూ.. “ఆస్ట్రేలియా జట్టుతో ఆడటం నాకు చాలా ఇష్టం, అక్కడికి వెళ్లడం నాకు చాలా ఇష్టం” అంటూ రోహిత్ నవ్వుతూ అన్నాడు. “ఆస్ట్రేలియాలోని ప్రజలు క్రికెట్‌ను చాలా ఇష్టపడతారని’’ చెప్పాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న భారత జట్టు రెండు బృందాలుగా ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది.