IPL 2024 : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై నెటిజన్ల ఆగ్రహం

ఐపీఎల్ 2024 సీజన్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది..

Rohit sharma Impact Player : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి  ముంబై ఇండియన్స్ (ఎంఐ) వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. 170 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టుకు ఆరంభం నుంచే కలిసిరాలేదు. కోల్ కతా జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ముంబై బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. సూర్యకుమార్ యాదవ్ (56: నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లు) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. ఈ మ్యాచ్ లో విశేషం ఏమిటంటే.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చారు. దీంతో ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ మైదానంలో కనిపించలేదు. రోహిత్ ను ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ల జాబితాలో చేర్చడంపట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read : Ipl 2024 : మారని ముంబై.. ఖాతాలో మరో ఓటమి

ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ లో భాగస్వామిని చేయకపోవడం పట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహంతో ఉన్న రోహిత్ ఫ్యాన్స్.. తాజాగా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలోకి తీసుకెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యానే దీనికి కారణమని రోహిత్ అభిమానులు భావిస్తున్నారు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలోకి తీసుకెళ్లడంతో తొలి ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Also Read : Kavya Maran : ఆఖ‌రి బంతికి స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం.. ఎగిరిగంతులేసిన కావ్య పాప‌.. వైర‌ల్‌

ఐపీఎల్ 2024 సీజన్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది.. పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. శుక్రవారం రాత్రి కేకేఆర్ జట్టుపై ఓటమితో ముంబై జట్టు ప్లేఆఫ్ ఆశలను కోల్పోయింది.

 

 

ట్రెండింగ్ వార్తలు