Rohit Sharma-Shardul Thakur
Rohit Sharma : మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (Team India)శుభారంభం చేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరిగిన మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్, జడేజా ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
శార్దూల్ పై రోహిత్ మండిపాటు
హిట్‌మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మ్యాచ్‌లో తన సహనాన్ని కోల్పోయాడు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)పై మండిపడ్డాడు. అందుకు ప్రధాన కారణం శార్దూల్ ఠాకూర్ ఫీల్డింగ్‌లో చురుకుగా లేకపోవడమే.
విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు. ఓ బంతిని విండీస్ బ్యాటర్ షై హోప్ కవర్ డ్రైవ్ ఆడాడు. కవల్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఠాకూర్ బంతిని అందుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ వద్ద బంతి ఆగిపోయింది. శార్దూల్ చురుకుగా లేకపోవడంతో విండీస్ బ్యాటర్లు మూడు పరుగులు తీశాడు.
దీనిపై రోహిత్ మండిపడ్డాడు. శార్ధూల్ వైపు చూస్తూ కోపంగా ఏదో అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి..
రెగ్యులర్‌గా ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మ మొదటి వన్డేలో ఏడో స్థానంలో బరిలోకి దిగాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అలా చేసినట్లు మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. వాస్తవానికి బార్బడోస్ పిచ్ ఇలా స్పందిస్తుందని తాను అస్సలు ఊహించలేదన్నాడు. బౌలర్లను పరీక్షించేందుకు టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక తాను ఏడో నంబర్‌లో బ్యాటింగ్ రావడం పై వస్తున్న కామెంట్ల గురించి మాట్లాడాడు. ఆ స్థానంలో బరిలోకి దిగడం తనకు కొత్తేమీ కాదని, తాను అరంగ్రేటం చేసిన తొలి నాళ్లలో ఏడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడినన్నాడు. పాత రోజులు గుర్తుకు వచ్చాయన్నాడు.