×
Ad

Rohit Sharma : వాళ్లిద్దరూ ఔట్..! టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. ఇక దబిడిదిబిడే

Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మ చేపట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Rohit Sharma

Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మ చేపట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సౌతాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈనెల 30వ తేదీన తొలి వన్డే, డిసెంబర్ 2, 6 తేదీల్లో రెండు, మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ తరువాత 9, 11, 14, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. అయితే, వన్డే, టీ20 సిరీస్ లకు శనివారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది.

దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో గిల్ గాయపడ్డాడు. దీంతో రెండో టెస్టులోనూ బరిలోకి దిగలేదు. గిల్ మెడ నొప్పి తగ్గడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం అతను ముంబయిలో ఉన్నాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వన్డే సిరీస్ కు గిల్ అందుబాటులో ఉండకపోవచ్చునని.. టీ20 సిరీస్ కు మళ్లీ జట్టులోకి వస్తాడని బీసీసీ వర్గాల తెలిపాయి.

కెప్టెన్ గిల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉండటంతోపాటు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. శ్రేయాస్ కోలుకోవటానికి ఇంకా సమయం పడుతుందని, అతను ఇంకో రెండు నెలల తరువాత కానీ మైదానంలోకి రాలేడని సమాచారం. సిడ్నీలో ఈనెల 16న ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టే ప్రయత్నంలో డ్రైవ్ చేయగా.. అతడి కడుపులో తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రేయాస్ చికిత్స పొందుతున్నాడు.

కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లు జట్టుకు దూరం కానుండటంతో వన్డే కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, కేఎల్ రాహుల్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం వన్డే, టీ20 జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ కు అప్పగిస్తారా.. కేఎల్ రాహుల్ లేదా వేరే వారికి అప్పగిస్తారా అనే విషయంపై స్పష్టత రానుంది.