IPL 2023, PBKS vs RCB: పంజాబ్‌ను మ‌ట్టిక‌రిపించిన బెంగ‌ళూరు.. ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Royal Challengers Bangalore

IPL 2023, PBKS vs RCB: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46), జితేశ్ శ‌ర్మ‌(41) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా, హ‌స‌రంగా రెండు వికెట్లు, పార్నెల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు డుప్లెసిస్‌(84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి(59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు శుభారంభం అందించారు. పోటాపోటీగా బౌండ‌రీలు కొట్ట‌డంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి ఆర్‌సీబీ 59/0 తో నిలిచింది. అదే ధాటిని కొన‌సాగించ‌డంతో 10 ఓవ‌ర్ల‌కు 91/0 కి చేరింది. లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఐపీఎల్‌లో 29వ‌ అర్ధ‌శ‌త‌కాన్ని డుప్లెసిస్ అందుకున్నాడు.

IPL 2023, PBKS vs RCB: పంజాబ్ పై బెంగ‌ళూరు విజ‌యం

ఈ స‌మ‌యంలో పంజాబ్ బౌల‌ర్లు పుంజుకున్నారు. వికెట్లు తీయ‌లేక‌పోయిన‌ప్ప‌టికి ప‌రుగుల‌ను క‌ట్ట‌డి చేశారు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన కోహ్లి ఐపీఎల్‌లో మ‌రో హాఫ్ సెంచ‌రీని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అర్ధ‌శ‌త‌కం పూరైన కాసేప‌టికే హ‌ర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో కోహ్లి ఔట్ అయ్యాడు. దీంతో 137 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ మ‌రుస‌టి బంతికే మ్యాక్స్ వెల్ కూడా హ‌ర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అథ‌ర్వ తైడేకు క్యాచ్ ఇచ్చి ప‌రుగుల ఖాతా తెర‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ధాటిగా ఆడే క్ర‌మంలో డుప్లెసిస్‌, పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ దినేశ్ కార్తిక్ (7) లు ఔటైయ్యారు. ఆఖ‌ర్లో మహిపాల్ లోమ్రోర్(7 నాటౌట్‌) షాబాద్ అహ్మ‌ద్‌(5 నాటౌట్‌) లు కాస్త వేగంగా ఆడ‌డంతో బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయ‌గా నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli: ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి