మరో సాక్షి-ధోనీ లవ్ స్టోరీ రిపీట్ కానుందా?

సన్‌రైజర్స్ హైదరాబాద్  అధికారిక ట్విట్టర్ చేసిన పోస్టు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. సాక్షి-ధోనీల లవ్ స్టోరీ మళ్లీ రిపీట్ అవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో.. ఓ హోటల్ మహిళా ప్రతినిధి కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. ‘సన్‌రైజర్స్ హోటల్‌కు చేరుకుంది. మరో కథకు ఆరంభం’ అని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 

హైదరాబాద్ జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 4న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్కడున్న హోటల్ సిబ్బంది సన్ రైజర్స్ టీం మెడలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో జానీ బెయిర్ స్టో మెడలో కండువా కప్పగానే కాస్త సమయం వరకూ కళ్లు కలిసాయి. అప్పుడే కెమెరా క్లిక్‌మనిపించింది.

నెట్టింట్లో వైరల్ అయిన ఈ ఫొటోను చూసి అభిమానులు.. సాక్షి ధోనీల ప్రేమ కథను గుర్తు చేసుకుంటున్నారు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో చూపించిన విధంగా ధోనీ హోటల్‌లో సాక్షి ఇంటర్న్ షిప్ చేస్తుండగానే కలుసుకున్నాడు. ఆ తర్వాత 2010లో వారి వివాహమైంది. సీజన్‌లో భాగంగా జరిగిన సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో మాత్రమే.. ఓడి ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సత్తా చాటింది.