Gautam Gambhir : ఆసియా కప్ 2025 ముందు ఉజ్జయినిలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రత్యేక పూజలు..
గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) శుక్రవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్నిసందర్శించారు.

Gautam Gambhir Visits Mahakaleshwar Jyotirlinga Temple Ahead Of Asia Cup 2025
Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) శుక్రవారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని (Mahakaleshwar Jyotirlinga Temple ) సందర్శించారు. ఆలయంలో జరిగిన ‘భస్మ ఆరతి (Bhasma Aarti)’ లో తన భార్య, కూతురితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక్కడికి మూడో సారి వచ్చానని చెప్పాడు. ఈసారి తన కుటుంబంతో కలిసి వచ్చానన్నాడు. ఆ భగవంతుని ఆశీస్సులు దేశం మొత్తం పై ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
ఆసియా కప్ 2025కి జట్టు ప్రకటన ఎప్పుడంటే..?
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఆగస్టు 19న లేదా 20న ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
Gambhir attends Bhasma Aarti at Shri Mahakaleshwar Jyotirlinga Temple in Ujjain. ❤️🙏 pic.twitter.com/ZrnUljdW0L
— Johns. (@CricCrazyJohns) August 15, 2025
ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 10న ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఆ తరువాత క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ తలపడనుంది.
టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు..
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో ఈమెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే అత్యుత్తమ జట్టును టీమ్ఇండియా రూపొందించుకోవాల్సి ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆసియాకప్ నుంచే టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అత్యుత్తమ జట్టును తయారు చేసుకునే పనిలో నిమగ్నం కానుంది.
గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఒకేసారి బాధ్యతలను అందుకున్నారు. గంభీర్ మార్గనిర్దేశ్యంలో భారత్ ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో టూర్‌కు ముందు అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని గంభీర్ సందర్శించి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.