Sanjiv Goenka Opens Up On Rumours Of LSG Saving Rs 50 Crore For Rohit Sharma
Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడా? ఐపీఎల్ 2025 సీజన్‌లో కొత్త ప్రాంఛైజీకి ఆడబోడుతున్నాడా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హిట్‌మ్యాన్ కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది చివరిలో మెగా వేలం జరగనుండడంతో వేలంలోకి రోహిత్ వస్తాడని అంటున్నారు.
అతడిని సొంతం చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు రూ.50 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే పంజాబ్ కింగ్స్ తరుపున సంజయ్ బంగర్ స్పందించాడు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలోకి వస్తే అతడికి భారీ ధర పలుకుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. యాభై కోట్లు పెట్టి అతడిని తమ జట్టు సొంతం చేసుకుంటుందా అంటే గట్టిగా చెప్పలేనని అన్నాడు.
ఇక తాజాగా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా స్పందించాడు. రోహిత్ శర్మ కోసం ఎల్‌ఎస్‌జి విడిగా రూ.50 కోట్లు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? అనే ప్రశ్న గోయెంకాకు ఎదురైంది. దీనిపై గోయెంకా ఇలా స్పందించాడు. రోహిత్ శర్మ వేలానికి వస్తాడో రాడో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించాడు. ఇవన్నీ రూమర్లు మాత్రమేనని, ముంబై అతడిని విడుదల చేస్తుందో లేదో తెలియదన్నాడు.ఒకవేళ హిట్‌మ్యాన్ వేలంలోకి వచ్చినా.. ఒక్క ఆటగాడి కోసం పర్సులోని 50 శాతం ఉపయోగిస్తే మీరు మిగిలిన 22 మంది ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.
ఇక రోహిత్ శర్మ తమ జాబితాలో ఉన్నాడో లేదో సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రతి ఒక్కరూ టాప్ ఆటగాడిని తీసుకోవాలని కోరుకుంటారు. జట్టులో అత్యుత్తమ కెప్టెన్, ప్లేయర్లు ఉండాలని అనుకుంటారు. అందుబాటులో ఉన్న వాటిల్లోంచి మెరుగైనవి ఎంచుకుంటాం. ఇలాగే దాదాపు అన్ని ప్రాంఛైజీలు ఆలోచిస్తాయి. అంతే కదా.. అందుకని అందరిని తీసుకోవడం కుదరదు కదా అని అన్నాడు.