Shreyas Iyer score only 8 runs in 1st Unofficial Test 1st innings against Australia A
Shreyas Iyer : స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ భారత్-ఏ తరుపున బరిలోకి దిగి విఫలం అయ్యాడు. 13 బంతులను ఎదుర్కొన్న అయ్యర్ ఒక్క ఫోర్ కొట్టి 8 పరుగులు మాత్రమే చేశాడు. రోచిసియోలి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో సామ్ కొన్‌స్టాస్ (109), జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. క్యాంప్‌బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్-ఏ బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్-ఏ జట్టుకు ఓపెనర్లు అభిమన్యు ఈశర్వన్ (44), ఎన్ జగదీసన్ (64) తొలి వికెట్‌కు 88 పరుగలు జోడించి శుభారంభం అందించారు. ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (73) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సాయిసుదర్శన్ ఔటైన తరువాత క్రీజులో అడుగుపెట్టిన అయ్యర్(Shreyas Iyer ).. భారీ స్కోరు సాధించి టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. అయితే.. అతడు ఘోరంగా విఫలం అయ్యాడు.
మూడో రోజు టీ విరామానికి భారత్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (38), ధ్రువ్ జురెల్ (25) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది.