Shreyas Iyer
Shreyas Iyer: టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు లండన్‌కు వెళ్లాడు. మంగళవారం అతడికి సర్జరీ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి అయ్యర్ ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు కూడా దూరం అయినట్లే. ఫిట్‌నెస్ సాధించిన తరువాత అయ్యర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో రిహాబిలిటేషన్ క్యాంపులో ఉండనున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నబుమ్రా కూడా ఇక్కడే ఉన్నాడు.
World Cup 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. బుమ్రా సర్జరీ విజయవంతం, శ్రేయాస్ సంగతేంటంటే.?
రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. వెన్ను సమస్య కారణంగా 2023 సీజన్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. అతడి గైర్హాజరీలో కోల్‌కతా కెప్టెన్‌గా నితీశ్ రాణా తాత్కాలికంగా సేవలు అందిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచిన కోల్‌కతా.. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.