రంజీ ట్రోఫీ : పాము దెబ్బకు తొలి మ్యాచ్‌కు బ్రేక్!

  • Publish Date - December 9, 2019 / 12:48 PM IST

మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్‌లో జరిగింది.

ఆంధ్రప్రదేశ్, విదర్భ జట్లకు మధ్య సోమవారం తొలి మ్యాచ్ జరుగుతోంది. అదే సమయంలో మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. అంతే.. ప్రేక్షకులతో సహా ఆటగాళ్లు సైతం కలవరపాటుకు గురయ్యారు. టాస్ గెలిచిన విదర్భ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సడన్ గా మైదానంలోకి పాము వేగంగా పాకుతూ వచ్చేసింది. పామును చూసిన క్రికెటర్లు.. ఆడటం ఆపేసి పరుగులు పెట్టేశారు.

అప్పటివరకూ మైదానంలో పాకుతూ కనిపించిన పాము కాసేపటికి మాయమైంది. ఎక్కడ నక్కిందో తెలియక గ్రౌండ్ స్టాప్ పామును పట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. పాము కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. గతంలో ప్రొఫెషనల్ మ్యాచ్ లు జరిగే సమయంలో కూడా మైదానంలోకి ఇలాగే కుక్క, తేనెటీగలు రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అది విషసర్పం కావడంతో భయాందోళన నెలకొంది.

ఎట్టకేలకు పామును పట్టుకోవడంతో మ్యాచ్ మొదలైంది. ఆ తర్వాత ఆంధ్రా కెప్టెన్, టీమిండియా టెస్టు రెగ్యులర్ ఆటగాడు హనుమ విహారి నేతృత్వంలోని జట్టు 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఈ టోర్నీకి సంబంధించి బీసీసీఐ డొమెస్టిక్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. పాము కారణంగా మ్యాచ్ ఆలస్యమైందని తెలిపింది.

2019 ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు మైదానంలోని ఇరుజట్లు సహా అంపైర్లు నేలమీద పడుకుని ఉండిపోయారు.

రెండేళ్ల క్రితం రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఒక కారు దూసుకొచ్చింది. పాలమ్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ నిలిచిపోయింది. ఆ మ్యాచ్ జట్లలో ఇషాంత్ శర్మ, గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్ కూడా అదే మైదానంలో ఉన్నారు.

జట్లు ఇవే : 
Vidarbha: Wasim Jaffer, Faiz Fazal (c), Ganesh Satish, Akshay Wakhare, Aditya Sarwate, Sanjay Raghunath, Akshay Wadkar (wk), Rajneesh Gurbani, Lalit M Yadav, Mohit Kale, Yash Thakur

Andhra: CR Gnaneshwar, Prasanth Kumar, Hanuma Vihari (c), Ricky Bhui, Srikar Bharat (wk), Karan Shinde, Bandaru Ayyappa, Yarra Prithviraj, Girinath Reddy, Cheepurapalli Stephen, Naren Reddy.